గద్వాల : జిల్లాలో ఓ పాస్టర్ ( Pastor ) అమాయక ప్రజలను నమ్మబలికి సుమారు కోటిన్నర రూపాయలు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వర్గానికి చెందిన వారిని టార్గెట్ చేసుకుని ఈ మోసానికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు. గద్వాల ( Gadwal) మండలం గోనుపాడు గ్రామానికి చెందిన చర్చిలో పాస్టర్‌గా పనిచేసేందుకు వచ్చిన వసంత్ ( Vasanth ) అనే వ్యక్తి ప్రార్థనలకు హాజరవుతున్న ప్రజలను నమ్మబలికాడు.
డబ్బులు పెట్టితే రెట్టింపు లాభం వస్తుందని, అంతేకాకుండా వాహనాలు కూడా ఇస్తామని ఆశ చూపించి పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసినట్లు బాధితులు వెల్లడించారు.
గోనుపాడు గ్రామంతో పాటు ధరూర్ మండలం మార్లబీడు, గద్వాల, గట్టు మండలాలకు చెందిన పలువురు పాస్టర్ మాటలు నమ్మి డబ్బులు చెల్లించారు. అయితే, చెప్పిన విధంగా డబ్బులు గానీ, లాభాలు గానీ రాకపోవడంతో మోసపోయామని గ్రహించారు.
కొద్ది నెలలుగా తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పాస్టర్‌ను కోరినా కాలయాపన చేస్తూ తప్పించుకున్నాడని బాధితులు ఆరోపించారు. ఈ క్రమంలో పాస్టర్ గద్వాల నుంచి పరారైనట్లు తెలిపారు. ఇటీవల తిరిగి గద్వాలకు వచ్చిన వసంత్‌ను నిలదీయగా ఎలాంటి స్పందన లేక పోవడంతో గద్వాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు వెల్లడించారు.