మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 24 : పాలమూరు జిల్లా అంటే కరువు ప్రాంతమని.. అక్కడి వారు ప్రపంచవ్యాప్తంతా కార్మికులుగా కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తారనే మాటకు చరమగీతం పాడుతూ నూతన అధ్యాయనానికి అంకుర్పారణ చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. ఆదివారం దివిటిపల్లి వద్ద ఉన్న ఐటీ టవర్‌లో మ్యుల్లర్ డాట్ కనెక్ట్ సంస్థలో శిక్షణ పొందిన 140 మందికి ధ్రువపత్రాలను అందజేసి మాట్లాడారు. స్వరాష్ట్రంలో మహబూబ్‌నగర్ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. త్వరలోనే కేసీఆర్ ఎకో అర్బన్ పార్కులో జంగల్ సఫారీని ప్రారంభిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ అడిగిన వెంటనే మహబూబ్‌నగర్‌కు జెఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేశారని తెలిపారు.
విద్యా సంస్థలు, ఇండస్ట్రీస్‌తోపాటు పీఆర్ఎల్ఐతో కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల ద్వారా సాగునీటిని అందిస్తామని వివరించారు. అకౌంటెన్స్‌లో ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు ఉన్న మ్యుల్లర్ డాట్ కనెక్ట్ సంస్థ మహబూబ్‌నగర్ ఐటీ కారిడార్‌లో ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. యువతకు అమెరికాలో సైతం ఉద్యోగాలిచ్చేలా చూడాలని మ్యుల్లర్ డాట్ కనెక్ట్ అధ్యక్షుడిని మంత్రి కోరారు. ఐటీ కారిడార్ నుంచి మహబూబ్‌నగర్ టౌన్ వరకు 100 ఫీట్ల రహదారి నిర్మిస్తున్నామని, షాద్‌నగర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు భవిష్యత్‌లో మెట్రో రైలు వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. మహబూబ్‌నగర్‌లో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు అమెరికాను నుంచి వస్తున్నట్లు మ్యుల్లర్ డాట్ కనెక్ట్ ప్రెసిడెంట్ ఇలపకుర్తి ఫణి అన్నారు. ఈ ఏడాది హైదరాబాద్‌లోని తమ కంపెనీలో 150మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వచ్చే ఏడాదికి 1500మందిని తయారు చేస్తామన్నారు. సేవ, సంక్షేమమే ధ్యేయంగా తాము మహబూబ్‌నగర్‌ను వచ్చినట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో ముల్లర్ డాట్ కనెక్ట్ సంస్థకు చెందిన సీఎంఎ భానుప్రకాశ్, సుశాంత్, సందీప్, శరత్, వైస్ ఎంపీపీ అనిత, దివిటిపల్లి సర్పంచ్ జరీనా, రైతుబంధు సమితి డైరెక్టర్ లక్ష్మయ్య, రమణారెడ్డి, చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక కార్యక్రమాలు
పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని 25, 26, 27 తేదీల్లో మహబూబ్‌నగర్‌లో మినీ ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక, నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ఐటీ కారిడార్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. సోమవారం ప్రఖ్యాత గాయకురాలు శ్రవణ భార్గవి టీం, టిల్లు బ్రదర్స్ డాన్స్, మంగళవారం కృష్ణ చైతన్య టీం, మాస్టర్ గోవింద్ డాన్స్ కార్యక్రమం, బుధవారం జానపద, నృత్య కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు. ప్రతి రోజు సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారని, ప్రజలందరూ తరలొచ్చి విజయవంతం చేయాలన్నారు.
క్షత్రియ సమాజానికి అండగా ఉంటా..
మహబూబ్‌నగర్ అర్బన్, సెప్టెంబర్ 24 : క్షత్రియ సమాజానికి అండగా ఉంటామని మంత్రి తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని వీరన్నపేట చౌడేశ్వరీమాత ఆలయంలో తొగట వీర క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్యఅథితిగా హాజరు కాగా వారు సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని కులాలతో సమానంగా తోగట క్షత్రియ సమాజానికి కమ్యూనిటీ భవనం నిర్మిస్తామని, అందుకు 2వేల గజాల స్థలం, రూ.10లక్షలు మంజూరు చేస్తామన్నారు. భూత్పూర్ నుంచి చిన్నదర్పల్లి వరకు బైపాస్ రోడ్డుతో వీరన్నపేట మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాములు, బీఆర్ఎస్ నాయకులు, తోగట వీరక్షత్రియ సేవా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అన్ని విధాలా ఆదుకుంటాం..
పాలమూరు, సెప్టెంబర్ 24 : తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కృతజ్ఞత సభ నిర్వహించగా మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందరినీ అన్ని విధాలుగా ఆదుకుంటారని అన్నారు. సమాజంలో ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పదన్నారు. అనంతరం సంఘం సభ్యులు మంత్రిని గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.