మహబూబ్‌నగర్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మ డి మహబూబ్‌నగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. కాగా ఎన్నికలకు కౌంట్ డౌన్ షురూ అయ్యింది. మరో 24 గంటల్లో ఎంపీ ఎన్నికలు జరుగనుండగా సర్వం సిద్ధమైంది. పాలమూరు, కందనూలు లోక్‌సభ పరిధిలో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం ఎన్నికలకు ఏర్పాట్లు చేసింది. ఆదివారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రాల్లో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేయనున్నారు. రెండు లోక్‌సభల పరిధిలో రెండేసి ఈవీఎంలు వాడనున్నారు. మహబూబ్‌నగర్‌లో 31 మంది అభ్యర్థులు, నాగర్‌కర్నూల్‌లో 19మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు . నామినేషన్ల ఘట్టం ప్రారంభం అయినప్పటి నుంచి అభ్యర్థులు పల్లెలు, పట్టణాలను ప్ర చారాలతో హోరెత్తించారు. శనివారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగియగా.. అభ్యర్థులు ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పోలింగ్‌కు 24 గంటలే ఉండడంతో ఆయా పార్టీలు ఓటర్లను మద్యం మత్తులో ముంచెత్తుతున్నారు. ఈక్రమంలో బాలానగర్ సమీపంలో మద్యం లారీ పట్టుబడడం సంచలనం రేపింది. ఈ మద్యాన్ని గోవా నుంచి ఆంధ్రాకు తరలిస్తున్నట్లు సమాచారం.
సర్వం సిద్ధం..
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలకు సోమవారం ఉదయం ఏడు నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగనున్నది. మహబూబ్‌నగర్ లోక్‌సభలో 1,937 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. నాగర్‌కర్నూల్ లోక్‌సభ పరిధిలో 1,944 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా రిటర్నింగ్ అధికారులు, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన అబ్జర్వర్లు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందు కు విస్తృత ఏర్పాట్లు చేశారు. వివిధ వర్గాలకు సంబంధించి ప్రత్యేక పోలింగ్ కేంద్రాలతోపాటు మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ఎండలు ఎక్కువగా ఉండడంతో పోలింగ్ సమయాన్ని ఆరుగంటలకు పెంచారు.
సామగ్రి పంపిణీకి ఏర్పాట్లు..
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ పరిధిలోని అన్ని కేం ద్రాలకు పోలింగ్ సామగ్రిని పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పా ట్లు చేశారు. ఆదివారం ఆయా జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్లలో పోలిం గ్ సామగ్రిని కేంద్రాలకు తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈవీఎంలు, ఇతర సామగ్రిని భారీ బందోబస్తు మధ్య కేంద్రాలకు తరలించనున్నారు. సిబ్బందిని సైతం ఆయా కేంద్రాలకు తరలించి అ క్కడే ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద మంచినీటి వసతి, టెంట్లు, ఓటర్లకు కావాల్సిన ప్రాథమిక సౌకర్యాలను కల్పించారు. ప్రత్యేక నిఘాతో పాటు వెబ్ కెమెరాలతో పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించనున్నారు. మరోవైపు ఆయా లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలీసు యంత్రాంగం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.