కొల్లాపూర్ రూరల్, జనవరి 13 : కడుపులోనే శిశువు మెడకు పేగు చుట్టుకొని ప్రసవానికి ఇబ్బందులు పడుతున్న నిండు గర్భిణీకి ఎంతో నేర్పుతో, సహనంతో నర్సు డెలివరీ చేసింది. దీంతో పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మాతా శిశుసంరక్షణ దవాఖానలో ఆదివారం చోటు చేసుకున్నది. వివరాలు ఇలా..
యన్మన్బెట్ల గ్రామానికి చెందిన శిరీష ప్రసవం కోసం 5వ తేదీన కొల్లాపూర్లోని మాతా శిశుసంరక్షణ ఆరోగ్య కేంద్రానికి ఆమె భర్త హుస్సేనయ్యతో కలిసి వెళ్లింది. దవాఖాన సిబ్బంది ఆమెను అడ్మిట్ చేశారు. నొప్పుల రావడంతో విధుల్లో ఉన్న నర్సులు శోభ, మంజుల, రాణి వైద్య పరీక్షలు చేసి శిరీషకు ప్రస వం కావడం చాలా కష్టమవుతున్నదని భయపడ్డారు. కడుపులో బిడ్డ మెడకు పేగు చుట్టకొని ఉందన్న విషయాన్ని గుర్తించిన వీరు గర్భిణి భర్త హుస్సేనయ్యకు తెలిపారు. ఎలాగైనా తన భార్యా బిడ్డల ప్రాణాలు కాపాడాలని అతడు ప్రాధేయపడ్డాడు. దీంతో ధైర్యంతో నర్సులు నార్మల్ ప్రసవం చేశారు.
శిరీష పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. టెన్షన్ పడిన హుస్సేనయ్య సంతోషంతో నర్సులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం శిరీష కుటుంబ సభ్యులు సుఖ ప్రసవం చేసిన నర్సులను సన్మానించారు. అనంతరం మెడికల్ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉండే సిబ్బంది దవాఖానకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్యం అందిస్తే ఇలాంటి స్పందనే వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు శ్రీనివాస్, చంద్రశేఖర్, దవాఖాన చైర్మన్ జంబులయ్య, ఫార్మసిస్టు వెంకటేశ్, సూపర్వైజర్ వెంకటమ్మ, కొల్లాపూర్ ఎంసీహెచ్ సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.