మరికల్ : మాజీ ఉద్యోగులు, నూతన ఉద్యోగులు ( Employees ) గ్రామానికి సేవలందించి గ్రామస్థుల మన్ననలు పొందాలని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్( Erra Shekar ) కోరారు. మరికల్ మండలంపెద్ద చింతకుంట గ్రామంలో ఆదివారం గ్రామ వికాస పరిషత్( Grama Vikasa Parishad ) ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన మాజీ ఉద్యోగులను, నూతన ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా పెద్ద చింతకుంట గ్రామం నివాసి, జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన పలువురు పదవి విరమణ చేసిన ఉద్యోగుల సేవలను కొనియాడారు. నూతనంగా వివిధ శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిని సైతం గ్రామ వికాస పరిషత్ సన్మానించడం అభినందనీయమన్నారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులను మార్గదర్శకంగా తీసుకుని నూతన ఉద్యోగులు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
పెద్ద చింతకుంట ఉన్నత పాఠశాలలో సమస్యల పరిష్కారానికి గ్రామానికి చెందిన ఉద్యోగులు విరాళాలు సేకరించడంచ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తుండడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వికాస పరిషత్ సభ్యులతోపాటు అఖిలపక్ష నాయకులు, యువకులు పాల్గొన్నారు .