జోగులాంబ గద్వాల : విద్యార్థులకు మెనూ( Menu) ప్రకారం నాణ్యమైన ఆహారం అందించకపోతే బాధ్యులపై కఠిన చర్యలు ( Action ) తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ ( Collector Santosh ) అన్నారు.
బుధవారం గద్వాల్ మండలంలోని గోనుపాడు గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, వంటగది, త్రాగునీరు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి ఇప్పటి నుంచే ఇష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఈ సందర్భంగా వారి హాజరును స్వయంగా పరిశీలించారు. విద్యార్థులు పూర్తి శ్రద్ధతో చదువుపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు.
మధ్యాహ్న భోజన తనిఖీలో మెనూ ప్రకారం భోజనం అందించకపోవడంతో, ప్రధానోపాధ్యాయురాలికి మెమో జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు మెనూ ప్రకారం ప్రతి రోజు పౌష్టికాహారం ఇవ్వాలని, ఆహార పదార్థాలు నాణ్యంగా ఉండేలా చూడాలన్నారు. వంట కోసం తాజా కూరగాయలు, నాణ్యత గల సరుకులు మాత్రమే వినియోగించాలన్నారు.
విద్యార్థులకు నాణ్యమైన బోధన, రుచికరమైన ఆహారం, ఆరోగ్యం అందించాలని, నిర్లక్ష్యం తగదని హెచ్చరిం చారు. విద్యార్థుల హాజరును సాంకేతికంగా పర్యవేక్షించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను నిత్యం వినియోగించాలని అన్నారు. యుడైస్ ఎంట్రీలు సమయానికి అప్డేట్ చేయాలని సూచించారు.