వనపర్తి, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వా రా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకే అందించేలా చర్యలు చేపట్టాలని జాతీ య మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది సూచించారు.
బుధవారం కమిషన్ సభ్యురాలు వనపర్తి జిల్లా పర్యటన సందర్భంగా ఐడీవోసీ సమావేశపు హాలు లో కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్‌తో కలిసి 15ప్రోగ్రాంల అమలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మైనార్టీలకు సంబంధించిన పాఠశాలలు, అందులో ప్రభుత్వ స్థలంలో ఉన్నవి ఎన్ని అనే వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ఇందుకు ఆయన 15 ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలలు, మూడు ఉన్నత పాఠశాలలు ఉన్నాయని, వీటిలో 652 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నట్లు చెప్పా రు.
రూ. లక్ష సబ్సిడీ రుణాలు 100 మందికి ఇవ్వడం జరిగిందని, 280 కుట్టుమిషన్లు, 9,809 మంది మైనార్టీ విద్యార్థులకు 652 లక్షల పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్ ఇచ్చినట్లు ఆర్డీవో పద్మావతి వివరించారు. ఘణపురం మండలంలో 21ఎకరాల వక్ఫ్ భూములు ఆక్రమణకు గురైనట్లు చెప్పగా ,వెంటనే చర్యలు తీసుకోవాలని తాసీల్దార్‌ను కమిషన్ సభ్యురాలు ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొన్నారు.
పట్టణంలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలను జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది సందర్శించారు. పాఠశాలలో మౌలిక వసతులను ప రిశీలించి విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. పాఠశాల భవనం శిథిలావస్థలో ఉందని, మరో భవనంలోకి మార్చాలని ఆర్ఎల్సీ కిరణ్మయిని ఆదేశించారు.