ఊటూర్, జూలై 24 : నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులో భూములను కోల్పోతున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని, ఎకరాకు రూ. 60లక్షలు పరిహారం చెల్లించాలని భూ నిర్వాసితుల సంఘం అధ్యక్షుడు మోటార్ గోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని గాంధీనగర్‌లో భూనిర్వాసితులు ప్రభుత్వ చర్యలకు నిరసనగా జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ప్రతిజ్ఞ చేశారు. భూములు కోల్పోయిన రైతులకు భూముల బేసిక్ ధరను నిర్ణయించేందుకు తక్షణమే కమిషన్ ఏర్పాటు చేయాలని, 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని, ప్రభుత్వం బలవంతపు భూ సేకరణను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. దంతన్‌పల్లి శివారులో ఎకరా భూమి రూ.40 లక్షల నుంచి రూ. 60 లక్షలు వెచ్చిస్తే గాని దొరకని పరిస్థితి ఉందని అలాంటిది ప్రభుత్వం ప్రాజెక్టులో భూ ములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.14 లక్షలు మాత్రమే చెల్లించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు తమ తాతలు, ముత్తాతల కాలం నుంచి వ్యవసాయమే జీవనాధారంగా ఉన్నామని, ప్రాజెక్టులో భూములు కోల్పోతే జీవనం ఏ విధంగా సాగించాలో ప్రభుత్వమే చెప్పాలన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరిలు స్పందించి భూ నిర్వాసితులకు తగిన పరిహారంతోపాటు ఇంటికో ఉద్యోగ అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం దిగివచ్చి తమ న్యాయమైన డిమాండ్లను ప రిషరించే వరకు అధికారులను తమ వ్యవసాయ భూ ముల్లో అడుగు పెట్టనీయమని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతులు సురేందర్‌రెడ్డి, తరుణ్, లక్ష్మీరెడ్డి, రాఘవేందర్ గౌడ్, విజయ భాసర్‌రెడ్డి, రాంరెడ్డి, లక్ష్మప్ప, వడ్డే చిన్నహన్మంతు, పెద్ద హన్మంతుతోపాటు రైతులు తదితరులు పాల్గొన్నారు.