వెల్దండ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) శంకుస్థాపన చేసిన వంద పడకల ఆసుపత్రికి (Hundred Bed Hospital ) తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ శంకుస్థాపనలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ ( BRS ) యూత్ మండల అధ్యక్షుడు జంగిలి యాదగిరి, మండల నాయకుడు జంగిలి ప్రవీణ్ ఆరోపించారు. గురువారం వెల్దండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
కాంగ్రెస్ ముగ్గురు మంత్రుల బృందం కల్వకుర్తి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడాన్ని హర్షిస్తున్నామని, అయితే ఇంతకుముందే చేసిన పనులకు మళ్లీ శంకుస్థాపన చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపనల పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సహకారంతో , అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అక్టోబర్ 1 2023న వంద పడకల ఆసుపత్రికి శిలాఫలకం వేశారని గుర్తు చేశారు.
వెల్దండ నుంచి చారకొండ వరకు రెండు వరుసల బీటీ రోడ్డుకు మంజూరు ఇవ్వడం జరిగిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకాలకు తెరతీస్తుందని ఆరోపించారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కంగు తినడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమ కారుడు ఎంఎస్ గౌడ్, జంగిలి రవి, మట్ట రఘు గౌడ్ , గోరేటి రాజు, గోరటి దశరథం, బర్కాం గణేష్ ఉన్నారు.