మహబూబ్‌నగర్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ హీట్ పెరుగుతున్న వేళ.. ముఖ్యమంత్రికి మద్దతుగా నిలవాల్సిన సమయంలో సొంత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. ఉమ్మడి జి ల్లాలో మొత్తం 14మందిలో 13 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ముఖ్యమంత్రితోపాటు మ రో ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రంలో మంత్రులు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో సొంత జిల్లాలో ముఖ్యమంత్రికి మద్దతుగా కేవలం నలుగురే నిలబడడం చర్చనీయాంశంగా మా రింది.
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూతురు సు స్మిత సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడినా ఉమ్మడి జిల్లా మంత్రులు కూడా సీఎంకు మద్దతుగా మాట్లాడకపోవడం మెజారిటీ ఎమ్మెల్యేలంతా సైలెంట్ అయిపోవడం పా ర్టీలో గుబులు రేపుతోంది.. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయి నా మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుందని సంకేతాలు వినిపిస్తున్నాసొంత జిల్లా ప్రజా ప్రతినిధులు హ్యాండ్ ఇవ్వడం కలకలం రేగుతోంది. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక ఉమ్మడి జిల్లాకు చెందిన అనేకమంది నేతలకు పిలిచి మరి కార్పొరేషన్ పదవులు అప్పగించారు.
వీరు కూడా నోరు మెదపటం లేదు. ఎన్నికల ముందు కూడా తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్దేశంతో చాలామందికి టికెట్లు కూడా ఇప్పించారు. ఈ పరిస్థితుల్లో సొంత జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి వైపు నిలబడకపోవడం.. వారంతా అసమ్మతి వర్గంలో చేరిపోయారా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి స్వపక్షంలో విపక్షంగా మారి ఇటు పార్టీకి అటు సీఎంకు తలనొప్పి తెస్తున్నారు. మరోవైపు మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అసమ్మతి ఎమ్మెల్యేలను జతకట్టి రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. వనపర్తిలో ఎమ్మెల్యేకు అక్కడున్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిన్నారెడ్డికి పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది.
నారాయణపేటకు చెందిన ఓ నాయకుడు లైంగిక వేధింపుల కేసు ఏకంగా రాష్ట్ర పార్టీ ఇన్చార్జి మెడకు చుట్టుకొని రేవంత్ పైనే అనుమానాలు కలిగేలా చేసింది. ఇక ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పావులు కదుపుతుండడం.. మళ్లీ కాంగ్రెస్ పార్టీ గెలవదు అంటూ బహిరంగంగా అంటుండడం.. మంత్రులు ఉన్నా తమకు నిధులు ఇవ్వట్లేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇదంతా నివురు గప్పిన నిప్పులా మారి ఒక్కసారి భగ్గుమన్నది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యమంత్రి సీటుకు ఎసరు తీసుకొచ్చిన కాంగ్రెస్ నేతలు మద్దతు ఇవ్వకపోవడం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
రేవంత్‌కు వ్యతిరేకంగా ఏడాది కిందట మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు అసమ్మతి జట్టు కట్టడం అప్పట్లో సంచలనం సృష్టించింది. అంతేకాకుండా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా మంత్రి పొంగులేటి చర్యలు తీసుకోవడం లేదని.. హైదరాబాద్‌లోని ఓ బడా కాంట్రాక్టర్‌పై ఫిర్యాదులు చేశారు. ఖాజాగూడలో ఒక ల్యాం డ్ కబ్జా విషయంలో ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెట్టారు.
చేతుల్లో ఫైళ్లను పట్టుకొని బిల్డప్‌లు ఇచ్చారు. చివరకు ఏమైందో ఏమో కానీ ఆయన సైలెంట్ అయిపోయారు. ఇక మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే కూడా ఒక ల్యాండ్ కబ్జా విషయంలో బహిరంగ విమర్శలకు దిగారు. దీంతో ఆయన కూడా సైలెంట్ అయిపోయి సెటిల్మెంట్లు చేసుకున్నారని విమర్శలు గుప్పు మంటున్నాయి. నారాయణపేట, వనపర్తి, కల్వకుర్తి, గద్వాల ఎమ్మెల్యేలు కూడా రేవంత్‌కు దూరంగా ఉంటున్నారు. అసమ్మతి నేతలతో టచ్‌లో ఉండడం.. నియోజకవర్గాల్లో ఏకచత్రాధిపత్యం వహించడంతో పార్టీ ఇబ్బందుల పాలవుతుంది. అయినా పట్టీ పట్టినట్లు వ్యవహరిస్తున్నారు.
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఇద్దరు మంత్రులు క్యాబినెట్ హోదాతో పదవులు అనుభవిస్తున్నారు. ప్రస్తుతం మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య అగాధం పెరిగిన వేళ సొంత జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సైలెంట్ కావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సీఎం విదేశాల్లో ఉన్న తరుణంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నా మంత్రులు అస్సలు మాట్లాడటం లేదు. కనీసం ఖండించడం లేదు.. లోలోపల అసంతృప్తులతో జట్లు కడుతున్నట్లు పార్టీ నేతలు అంటున్నారు.
ఇదిలా ఉండగా మంత్రులకు ముఖ్యమంత్రి నిధులు ఇవ్వక పోవడం.. తమ సొంత నియోజకవర్గంలో అనుకున్న స్థాయిలో పనులు జరగడం లేదనే భావనలో ఉన్నారు. మరోవైపు బలహీన వర్గాలకు చెందిన మంత్రి వాకిటి శ్రీహరిని ఉద్దేశించి ఇటీవల ముఖ్యమంత్రి ఏకంగా ఆయన నియోజకవర్గంలోనే నువ్వు మంత్రివి కాదు.. సర్పంచ్ వంతు అని సంబోధించడంతో తీవ్ర మనస్థాపం చెందారు. దీనివల్ల ఆయన కూడా ముఖ్యమంత్రి అంటేనే భగ్గుమనే రేంజ్లో ఉన్నారు.
నియోజకవర్గాల అభివృద్ధి కోసం క్యాబి నెట్లో లేవనెత్తుతున్నా నయా పైసా కూడా ప్రభుత్వం నుంచి రావడం లేదు. దీంతో మంత్రులు కూడా రేవంత్‌కు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు ఆరుగురు ఎమ్మెల్యేలు అసం తృప్తి వ్యక్తం చేయడంతో రాష్ట్రంలో ప్రతికూల సంకేతాలు వెళ్తున్నాయి. అయితే పచ్చ కాంగ్రెస్.. అసలు కాంగ్రెస్.. బయ టపడే తరుణం వచ్చిందని.. కట్టర్ కాంగ్రెస్ వాదులు అంటు న్నారు. నిజమైన కాంగ్రెస్ నాయకులకు టికెట్లు ఇచ్చి గెలిపించి ఉంటే.. ఇలాంటి పరిస్థితి ముఖ్యమంత్రికి వచ్చి ఉండేది కాదని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంపైన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాష్ట్రంలో రాజకీయ వేడి రగులుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నేతల తీరు పార్టీని వర్గాలుగా విడగొట్టింది.