నాగర్‌కర్నూల్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): వైద్య రంగంలో పేదల స్వప్నం సాకారమవుతోంది. సీఎం కేసీఆర్ ముందు చూపుతో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో వైద్య సేవలు పేదల వద్దకే రాబోతున్నాయి. వ్యవసాయం, విద్యతో పాటుగా వైద్య రంగానికీ సీఎం పెద్ద పీటవేశారు. పేదలకు ప్రభుత్వ దవాఖానల్లో నమ్మకమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పడిన ప్రతి జిల్లాలోనూ మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొత్తగా మెడికల్ కళాశాలలు మంజూరు కాగా తొలి విడుతగా ఈనెల 15నుంచి రాష్ట్రంలో 8 ప్రభుత్వ వైద్య కళాశాలల తరగతులు ప్రారంభం కానున్నాయి. కళాశాలల నిర్మాణాల కోసం అవసరమైన రూ.కోట్లాది నిధులను మంజూరయ్యాయి. ఇలా నాగర్‌కర్నూల్‌తో పాటుగా వనపర్తి, సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం, మహబూబాబాద్ జిల్లాల్లో తరగతుల ప్రారంభానికి అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రతి కళాశాలలో 150సీట్లు ఉంటాయి.
ఇందులో రాష్ట్ర విద్యార్థులకు 128సీట్లు, ఆల్ ఇండియా కోటాలో 22సీట్లు కేటాయించబడ్డాయి. ఇప్పటికే నీట్ ఫలితాలు వెలువడగా విద్యార్థులు వెబ్ కౌన్సెలింగ్‌లో కళాశాలలను ఎంచుకొంటున్నారు. అలాగే విద్యార్థులకు బోధించేందుకు అవసరమైన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లను సైతం ఇప్పటికే నియమించడం జరిగింది. ఆ వైద్యాధికారులు ప్రస్తుతం మెడికల్ కళాశాలల అనుబంధ వైద్యశాలల్లో సేవలు అందిస్తున్నారు. ఇక నాన్ టీచింగ్ స్టాఫ్ సైతం నియామకమయ్యారు. కళాశాలల్లో అనాటమీ, ఫిజియా, బయోకెమిస్ట్రీ, ఫార్మాలజీ, పాథాలజీలాంటి విభాగాలకు అధ్యాపకులు, సీనియర్ రెసిడెంట్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు చేరుకొన్నారు. మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఉన్న జిల్లాసుపత్రులను ప్రభుత్వం అదనపు బెడ్లను పెంచుతూ జనరల్ ఆస్పత్రులుగా అప్ గ్రేడ్ చేసింది. ఇందులో అన్ని రకాల ప్రత్యేక వైద్య సేవలు, పరికరాలను అందుబాటులో ఉంచింది. కొత్తగా ప్రారంభం కానున్న 8కళాశాలల్లో ఏకంగా ఒకేసారి 1200 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో 1024 సీట్లు రాష్ట్ర విద్యార్థులకే దక్కుతాయి. కాగా రామగుండం, మంచిర్యాలకు అదనంగా 27సీట్లు కేటాయించుతూ ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 17ప్రైవేట్‌లో మెడికల్ కళాశాలల్లో 3,200సీట్లు ఉండగా గతేడాది నుంచి 11ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 1,695 సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలల సంఖ్య 19కి చేరుకున్నది. ఇలా కొత్త కళాశాలల ఏర్పాటుతో రాష్ట్రంలో మెడికల్ సీట్ల సంఖ్య 6వేలకుపైగా చేరుకోనున్నాయి. దీనివల్ల రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య విద్య కల సాకారం కాబోతున్నది. ప్రస్తుతం ఉన్నత వైద్యం కోసం పాత జిల్లా కేంద్రాలతో పాటుగా హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేది. కొత్త కళాశాలల ప్రారంభంతో చాలా వరకు పేదలకు దగ్గరలోనే తక్కువ వ్యవధిలోనే 24గంటల పాటు పూర్తిగా నాణ్యమైన, ఉచిత వైద్యం అందుతున్నది. కళాశాలల్లో తరగతుల గదులు, స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ గదులు, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వసతి గృహాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాగా దశాబ్దాల నుంచి స్థానికంగా ప్రజలు ఎదురు చూస్తున్న మెడికల్ కళాశాల ఆకాంక్ష నెరవేరబోతుంది. మొత్తం మీద వైద్యకళాశాలల తరగతులు ప్రారంభం కానుండటం పట్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
రేపటి నుంచి తరగతులు
మెడికల్ కళాశాల తరగతులు ఈనెల 15నుంచి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కళాశాలలో 150సీట్లకుగానూ విద్యార్థులు అడ్మిషన్లు తీసుకొంటున్నారు. అవసరమైన టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది విధుల్లో చేరారు. ఎంబీబీఎస్ ఫస్టియర్ తరగతులకు కళాశాలలో విభాగాలు సిద్ధం చేశాం. బాలుర, బాలికలకు ప్రత్యేకంగా వసతి గృహాలను ఏర్పాటు చేశాం.
– రమాదేవి, మెడికల్ కళాశాల సూపరింటెండెంట్
సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది
నాగర్కర్నూల్లాంటి మారుమూల ప్రాంతాల్లోనూ మెడికల్ కళాశాల ఏర్పాటయ్యిందంటే దానికి సీఎం కేసీఆరే ప్రధాన కారణం. పేదలకు ఉచితంగా 24గంటల పాటు ఉచిత, నాణ్యమైన వైద్య సేవలు ఈ
కళాశాలల ద్వారా అందుబాటులోకి వస్తాయి. కళాశాలకు అనుబంధంగా జనరల్ దవాఖాన 330పడకలతో అప్‌గ్రేడ్ చేశాం. కళాశాల ఏర్పాటుకు ఎన్నో సమస్యలు ఎదురైనా సీఎం సహకారంతో అధిగమించాం. డిసెంబర్లో సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రానికి వచ్చి కళాశాలను పరిశీలిస్తారు.
– మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్