నాగర్ కర్నూల్ : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ( Muncipality) పై గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ( Marri Janardhan Reddy) ధీమాను వ్యక్తం చేశారు. గురువారం పట్టణంలోని 12, 13 వార్డులలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలు బొడ్రాయి, పోచమ్మ, ఈదమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆయా వార్డుల పరిధిలోని కాలనీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత త్రాగునీటి సమస్య ఏర్పడిందని స్థానికులు వివరించారు. 420 హామీలు , 6 గ్యారంటీల పేరుతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే వార్డులలో ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు సమస్యలపై నిలదీయాలని సూచించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.