Property Murder | జోగుళాంబ – గద్వాల జిల్లాలోని శాంతినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాపదిన్నె (తనగల) గ్రామంలో సంధ్య పోగు రమేశ్‌ను ఆస్తి కోసం అతడి తమ్ముడు మహేశ్, ఇతర కుటుంబ సభ్యులు హత్య చేశారు. ఆస్తుల విభజన వివాదంలో ఈ నెల 12న ఆయన తండ్రి సంధ్యపోగు కిష్టన్న, అన్న సంద్యపోగు గోపి, సంధ్య పోగు మహేశ్, తల్లి సంద్యపోగు తీములమ్మ, బోయ నర్సింహులు, బండమీది తిమ్మప్ప, బోయ నాగేంద్ర హత్య చేశారని తేలింది. హత్య చేసిన 48 గంటల్లో జోగుళాంబ-గద్వాల పోలీసులు కేసును చేధించారు. నిందితుల నుంచి ఒక కారు, మూడు కత్తులు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రస్తుతం మృతుడి తల్లి తీములమ్మ పరారీలో ఉందని చెప్పారు. సంద్యపోగు రమేశ్ భార్య చంద్రకళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ అత్తామామలు, బావ, మరుదులపై అనుమానం ఉందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై శాంతినగర్ సీఐ టాటాబాబు దర్యాప్తు చేపట్టారు.
సంద్యపోగు కిష్టన్న కొడుకులు గోపి, మహేశ్ తమ సోదరులు రమేశ్, తిమ్మప్పలతో ఆస్తి విషయంలో గొడవ పడుతుండే వారు. గతేడాది మహేశ్.. మోటార్‌సైకిల్‌పై వస్తుండగా, ఆయనపై రమేశ్, తిమ్మప్ప కేసు నమోదైంది. ఎలాగైనా అన్న రమేశ్‌ను చంపాలని నిర్ణయించుకున్న మహేశ్ తన తల్లిదండ్రులు, అన్న గోపితో చెప్పి పథకం వేశాడు.
మహేష్ తనకు పరిచయం ఉన్న బోయ నర్సింహులు ఈ సంగతి చెప్పి.. తన అన్న రమేశ్‌ను చంచితే రూ.1.50 లక్షల విలువ గల ఆటో ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరికి మరో ఇద్దరు బండమీది తిమ్మప్ప, బోయ నాగేంద్ర సహకారం తీసుకున్నారు. ప్రత్యేకంగా వేట కొడవళ్లు తయారు చేయించి రమేశ్ హత్యకు పథకం వేసుకున్నారు. వారం క్రితం రమేశ్.. వెంకటాపురం స్టేజ్ నుంచి యాపదిన్నెకు వెళుతుండగా బొలెరోతో ఢీ కొట్టి చంపాలనుకున్నా నెరవేరలేదు. తిరిగి ఈ నెల 12న కోర్టు పని కోసం తన మామ సుధాకర్‌తో కలిసి ఆలంపూర్ వెళ్లి తిరిగి వస్తున్నాడు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం మహేశ్, బోయ నరసింహులు ఒక కారులో, బోయ నరసింహులు బంధువులు బండమీద తిమ్మప్ప, బోయ నాగేంద్ర బొలెరో వాహనంలో అనుసరించారు. మద్దూరు స్టేజీ దగ్గర బోలెరో వాహనంతో రమేశ్ మోటార్ సైకిల్‌ను ఢీకొట్టారు. దీంతో రమేశ్, ఆయన మామ సుధాకర్ రోడ్డుపై పడిపోయారు. వెంటనే వెనుక ఉన్న మహేశ్, బోయ నరసింహులు కారు దిగి రమేష్‌పై వేట కొడవళ్లతో దాడిచేశారు. రమేశ్ గొంతు నరికి చంపారు. రమేశ్ మామ సుధాకర్ పైనా దాడి చేశారు. దీంతో ఆయన కింద పడిపోవడంతో నిందితులు అదే కారులో అక్కడినుంచి పరారయ్యారు.
మృతురాలి భార్య చంద్రకళ ఫిర్యాదుపై జోగుళాంబ-గద్వాల జిల్లా ఎస్పీ టీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు గద్వాల డీఎస్పీ వై మొగిలయ్య పర్యవేక్షణలో శాంతి నగర్ సీఐ టాటా బాబు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తునకు ప్రత్యేక టీం ఏర్పాటైంది. ప్రమాద స్థలంలో సీసీటీవీ కెమెరాలు, ఇతర సాంకేతిక నైపుణ్యం ఆధారంగా నిందితులను గుర్తించారు. విశ్వసనీయమైన సమాచారం మేరకు వారి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. న్యాయవాదితో మాట్లాడేందుకు వారు కారులో వెళుతుండగా జాతీయ రహదారిపై జల్లపూర్ ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక కారు, మూడు కత్తులు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును చేధించడంలో ప్రతిభ కనబరిచిన అయిజ ఎస్ఐ, మనోపాడు ఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు వెంకప్ప, యాకూబ్ హుస్సేన్, కానిస్టేబుళ్లు అయ్యన్న, విష్ణు వర్ధన్, ప్రసాద్, నబీ రసూల్, తులసీ నాయుడులను ఎస్పీ శ్రీనివాసరావు అభినందించారు. ప్రత్యేకంగా క్యాష్ రివార్డ్ అందించారు.