అలంపూర్, ఫిబ్రవరి 18 : అలంపూర్ క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఐదో శక్తిపీఠమైన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి, నవబ్రహ్మ, కోటి లింగాల ఆలయాలతోపాటు అలంపూర్ చౌరస్తాలోని ఆలయ ఆర్చిని విద్యుద్దీప కాంతుల్లో దేదీప్యమానంగా ముస్తాబు చేశారు. శనివారం తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో బారులుదీరారు. బాలబ్రహ్మేశ్వర స్వామికి అభిషకాలు, జోగుళాంబ దేవికి కుంకుమార్చనలు నిరంతరాయంగా జరిగాయి. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఆలయ ఆవరణలోని రాజగోపురం పరిసరాల్లో ఆదిదంపతుల కల్యాణం కనులపండువగా జరిగింది. పార్వతీపరమేశ్వరుల కల్యాణాన్ని తిలకించి భక్తులు తన్మయత్వం చెందారు.
బాలబ్రహ్మేశ్వర ఆలయం పైభాగంలో శివస్వాములతో ఆకాశజ్యోతి కార్యక్రమాన్ని అర్ధరాత్రి వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి శివస్వాములు శివజ్యోతిని మేళతాళాలు, నందికోళ్ల సేవ మధ్య ఊరేగింపుగా తీసుకొచ్చి శివాలయ శిఖర భాగం నుంచి జ్యోతిని ఆకాశంలోకి స్వాములు వదిలారు. జ్యోతి దర్శనంతో భక్తులు పరవశించిపోయారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
పుష్కరఘాట్ వద్ద రంగస్థల కళాకారుల నాటక ప్రదర్శన, ఇతర కార్యక్రమాలను తిలకిస్తూ భక్తులు జాగారం చేశారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ప్రతిమలకు బావి జలాలతో అభిషేకాలు చేశారు. క్యూలైన్లోని భక్తులకు ఉచితంగా మజ్జిగ ప్యాకెట్ల, తాగునీటిని ఆలయ కమిటీ అందజేయగా.. ఆర్యవైశ్య సంఘం, జోగుళాంబ సేవా సమితి పోలీస్ చిన్నయ్య ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేశారు. గద్వాల డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడిపినట్లు ట్రాఫిక్ కంట్రోలర్ దేవేందర్‌గౌడ్ తెలిపారు.
క్యాతూరు పీహెచ్సీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయగా.. జిల్లా ఫైర్‌స్టేషన్ వారు ఫైర్ ఇంజన్‌ను అందుబాటులో ఉంచారు. కార్యక్రమాల్లో ఆలయ ఈవో పురేందర్‌కుమార్, పాలక మండలి సభ్యులు, ప్రముఖులు, సమితి సభ్యులు వెంకన్నబాబు, శ్రీనివాసులు, ఆనంద్‌శర్మ, సంజీవనాయుడు పాల్గొన్నారు.
ప్రముఖుల రాక
శివరాత్రి పర్వదినాన అలంపూర్ ఆలయానికి ప్రముఖుల వచ్చారు. ఎమ్మెల్సీ కవిత, ఎ మ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయిచంద్, జెడ్పీ చైర్పర్సన్ సరితాతిరుపతయ్య, మాజీ ఎంపీ మంద జగన్నాథం, మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి, గట్టు తిమ్మప్ప, ఎస్పీ సృజనతోపాటు పలువురు దర్శించుకున్నారు.