వివాహేతర సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు రాజేస్తున్నాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు కపుల్స్ మధ్య వివాదాలకు కారణమవుతున్నాయి. తమ బంధానికి అడ్డొస్తున్నారని పతుల ఆయష్షును తీసేందుకు సైతం సతులు వెనుకాడడం లేదు. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తున్నది. మొన్న మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ మరిచిపోక ముందే తాజాగా గద్వాల జిల్లాలో అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకున్నది. అత్త, భార్య, ఆమె ప్రియుడు కలిసి భర్తను హత్య చేసిన సంఘటన తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నది. హత్యకు కారణమైన ముగ్గురిని నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని తీసుకున్నట్లు సమాచారం.
గద్వాల, జూన్ 23 : ఇటీవల మేఘాలయలో జరిగిన హనీమూన్ మర్డర్ తర హా ఘటన గద్వాలలో వెలుగు చూసింది. సోనమ్ రఘువంశీ ఘటన తర్వాత కొత్తగా పెళ్లయిన వారిలో హనీమూన్‌పై భయాందోళనలు నెలకొన్నాయి. ఈ తరహా ఘటన జోగుళాంబ గద్వాలలో వెలుగు చూసింది. తల్లితోపాటు బిడ్డతో కూడా బ్యాంక్ ఉద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. చివరికి వారి సాయంతో.. ఆ ఉద్యోగి ప్రోత్సాహంతో మహిళ భర్తనే హత్య చేయించింది. ప్రస్తుత సమాజంలో సతుల వివాహేతర సంబంధాల కారణంగా పతులు బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వివరాల్లోకి వెళితే.. గద్వాల పట్టణం గంట గేరికి చెందిన తేజేశ్వర్(32) కర్నూల్ జిల్లా కల్లూరు ఎస్టేట్ ప్రాంతానికి చెందిన ఐశ్యర్యను గత నెల 18వ తేదీన బీచుపల్లి ఆంజనేయస్వామిగుడిలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇది అబ్బా యి కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రమే పెళ్లికి వెళ్లారు. పళ్లైన తర్వాత ఇద్దరు గద్వాలలోని తల్లిదండ్రుల ఇంటికి వచ్చారు. అప్పటి నుంచి ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నా యి. తేజేశ్వర్ వివాహం వారి కుటుం బ సభ్యులకు నచ్చకపోవడంతో రోజు కలహాలు జరుగుతుండగా ఐశ్వర్య మాత్రం ఇక్కడ భర్తతో ఉంటూనే అక్కడ ప్రియుడితో ఫోన్లో చాటింగ్ చేస్తూ ప్రేమాయణం కొనసాగించింది.
ఐశ్వర్యకు తండ్రిలేడు. తల్లి సుజాత మా త్రమే ఉన్నది. తల్లి కర్నూల్ జిల్లా కేంద్ర ంలోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో స్వీపర్‌గా విధులు నిర్వహిస్తున్నది. ఆ క్రమంలోనే ప్రైవేట్ బ్యాంక్‌లో పనిచేసే మే నేజర్ తిరుమల్‌రావుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడిం ది. తల్లితో సహజీవనం చేస్తూ నే బ్యాంక్ మేనేజర్ కూతురితో రాసలీలలు మొదలు పెట్టా డు. అయితే బ్యాంక్ మేనేజర్‌కు పిల్లలు కాకపోవడంతో ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు. అయితే దీనికి బ్యాంక్ మేనేజర్ భార్య అంగీకరించకపోవడంతో పెళ్లి తంతు విరవించుకున్నాడు. ఈ క్రమంలోనే తేజేశ్వర్‌తో పరిచయం పెంచుకున్న ఐశ్వర్య, గతంలో నాకు పెండ్లి కుదిరిందని ఫిబ్రవరిలో పెండ్లి జరగాల్సి ఉండగా మా అమ్మ కట్నం ఇచ్చుకోలేక పెళ్లి ఆగిపోయిందని, తనకు ఎవరితో ఎఫైర్ లేదని నమ్మించి తేజేశ్వర్‌తో ప్రేమాయణం కొనసాగించింది.
నీ వంటే నాకు ఇష్టం అని మాయమాటలు చెప్పి తేజేశ్వర్‌ను నమ్మించి ఐశ్వర్య వివాహమాడింది. తేజేశ్వర్‌తో వివాహం అయినప్పటికీ బ్యాంక్ మేనేజర్ తిరుమల్‌రావుతో ఐశ్వర్య చాటింగ్‌లు, ఫోన్‌కాల్స్ కొనసాగిస్తూనే ఉన్నది. అనుమానం వచ్చి అత్తమామలు ఫోన్లు ఎక్కువగా మాట్లాడుతున్నావ్ అని ప్రశ్నించగా మా అమ్మతో మాట్లాడుతున్నాని అబద్ధాలు చెప్పి ప్రియుడితో మాట్లాడుతున్నట్లు తెలిసింది. అయితే ప్రియుడిపై ఉన్న మోజుతో భర్తను హత్య చేయించాలని భావించి తల్లి, బ్యాంక్ మేనేజర్‌తో మంతనాలు జరిపినట్లు సమాచారం. నెల రోజులలోనే తేజేశ్వర్‌ను హత్య చేయించడానికి నాలుగు సార్లు ప్రయత్నించింది. ఐదో ప్రయత్నంలో కర్నూల్‌కు చెందిన ముగ్గురికి సుఫారీ ఇచ్చారు.
ఈ క్రమంలో ఈ నెల 17న గుర్తు తెలియని నెంబర్ నుంచి తేజేశ్వర్‌కు తమకు పొలం కావాలని దానిని సర్వే చేయాలని, పొలం కొనుగోలు చేస్తే మంచి కమీషన్ ఇస్తామని ఫోన్ చేశారు. స్వతహాగా సర్వేయర్ అయిన తేజేశ్వర్ వారి మాటలు నమ్మి వారు తెచ్చిన కారులో బయలు దేరాడు. తేజేశ్వర్‌ను కారులో ఎక్కించుకొని గద్వాల మండలం పూడూరు, అనంతపురం, ఎర్రవల్లి, ఇటిక్యాల మండలం రావులచెర్వు, పెబ్బేర్, తుంగభద్రనది వైపు కారును తిప్పుతూ చివరికి గద్వాల మండలం పూడూరు-రావులచెర్వు మధ్య కారులోనే హత్య చేసి కర్నూల్ జిల్లా పాణ్యం సమీపంలోని సుగాలమెట్టు ప్రాంతంలో పిన్నాపురం చెరువులో మృతదేహాన్ని పడవేశారు.
పోలీసులు కాల్ డాటా తీయగా ఐశ్వర్య తన మాజీ ప్రియుడు తిరుమల్‌రావుకు సుమారు రెండు వేల సార్లు ఫోన్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు తేజేశ్వర్ డెడ్‌బాడీని గుర్తించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
హత్యచేసిన వారిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. హత్య చేసిన వారిని గద్వాల సీఐతోపాటు గట్టు, గద్వాల, పట్టణ, గద్వాల రూరల్ ఎస్సైలు వెంట బెట్టుకొని సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. హత్యలో పాల్గొన్న కర్నూల్‌కు చెందిన ముగ్గురితోపాటు వారికి సహకరించిన గద్వాలకు చెందిన వ్యక్తితోపాటు తేజేశ్వర్ భార్య ఐశ్వర, అత్త సుజాతను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా అక్రమ సంబంధాల మోజులో పడి మహిళలు ఏమి చేస్తున్నారో వారికే తెలియకుండా తమ నిండు నూరేళ్ల జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. సమాజంలో పరువు పోగొట్టుకుంటున్నారు.