మహబూబ్‌నగ ర్, మార్చి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు లో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పని చేద్దామని ఒకవైపు అధికార పార్టీ నాయకులు చెబుతూనే మరోవైపు విపక్ష నాయకులను టార్గెట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. నగర పాలక సంస్థ కమిషనర్‌తోపాటు కాంగ్రెస్ నాయకులు యాడ్ ఏజెన్సీని బెదిరించి బలవంతంగా మాజీ మంత్రి హోర్డింగ్‌లో తొలగించిన ఘట న చర్చనీయాంశంగా మారింది. 24 గంటల నుంచి యాడ్ ఏజెన్సీ నిర్వాహకులకు ఇటు నగరపాలక సంస్థ నుంచి అటు కాంగ్రెస్ నేతల నుంచి బెదిరింపులు మొదలయ్యాయి.
ఇక చేసేది లేక వాటిని తొలగించడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. పాలమూరులో హోర్డింగ్ రాజకీయం ప్రస్తుతం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున కార్పొరేటర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు హోర్డింగ్‌లు వేశారు. నియమ నిబంధనల ప్రకారం ఏజెన్సీ నిర్వాహకులకు ఐదు రోజులకు ఫీజు కట్టి బుక్ చేసుకుని హోర్డింగ్‌లకు బ్యానర్లు కట్టారు.
ఈనెల 16న మాజీ మంత్రి జన్మదినం ఉండగా 15న రాత్రికి వీటిని ఏర్పాటు చేశా రు. ఉగాది, రంజాన్ ఉన్నందున బీఆర్ఎస్ నేతలు ఈ నెల 20 వరకు బుక్ చేసుకున్నారు. జిల్లా కేంద్రంలో అడుగడుగునా మాజీ మంత్రి గులా బీ బ్యానర్లు కనబడడంతో అధికార పార్టీ నేతలకు మం డిపోయింది. మాజీ మంత్రి జన్మదిన వేడుకలు ఘనం గా నిర్వహించడంతో కొంతమంది కాంగ్రెస్ నేతలకు నిద్ర కూడా పట్టలేదు. ఇదిలా ఉండగా ఇటీవలే మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ ఎమ్మెల్యే జన్మదినం ఉన్నప్పటికీ అధికార పార్టీ నాయకులు ఎవరూ ఈ స్థాయిలో బ్యానర్లు కట్టకపోవడంతో సదరు ఎమ్మెల్యే పార్టీ నాయకులపై అక్కసు వెళ్లగక్కారు.
ఇటీవలే మేయర్ డిప్యూటీ మేయర్ల ప్రమాణ స్వీకారం జరిగిన ఆ స్థాయిలో బ్యానర్లు కనపడలేదు. దీంతో మాజీ మంత్రి జన్మదిన వేడుకలకు వెలిసిన హోర్డింగ్‌లు కాంగ్రెస్ నేతలకు కంటిమీద కునుక్కు లేకు ండా చేశాయి. సీన్ కట్ చేస్తే ఈ బ్యానర్లను వెంటనే తొలగించాలని ఏకంగా ఏజెన్సీ నిర్వాహకులకే హుకుం జారీ చేశారు. గంటలోపు బ్యానర్లు తీయకపోతే ఏజెన్సీని రద్దు చేస్తామని.. హోర్డింగ్‌లన్నీ పీకేస్తామని బెదిరింపులకు దిగారు. మున్సిపల్ కమిషనర్‌తోపాటు సిబ్బంది కూడా కాం గ్రెస్ నేతల ఆదేశాలతో నిర్వాహకులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి బ్యానర్లు తొలగించారు.
ఇదిలా ఉండగా ఇటీవలే గద్దెనెక్కిన అధికార పార్టీ నేత కూడా యాడ్ ఏజెన్సీపై చిందులు తొక్కారు. దీంతో మాజీ మంత్రి బ్యానర్లన్నీ క్షణాల్లోనే తొలగించి పడేశారు. ఈ విషయమే నగరపాలక సంస్థ కమిషనర్‌ను ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’ వివరణ కోరగా ఏజెన్సీకి నోటీసులు ఇస్తున్నామని.. రెన్యువల్ చేసుకోలేదని.. టైం ఉందో లేదో మాకేం తెలుసు అంటూ పొంతనలేని స మాధానాలు ఇచ్చారు.
ఇదిలా ఉండగా యాడ్ ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం మాకు పదేళ్ల అగ్రిమెంట్ ఉందని.. ప్రతి ఏడాది మార్చి 31న రెన్యువల్ చేసుకుంటామని స్పష్టం చేశారు. అయితే బీఆర్ఎస్ నేతలు మాత్రం ఐదు రోజులకు పర్మిషన్ తీసుకున్న మాట వాస్తవమేనని అన్నారు. పాలమూరులో మాజీ మంత్రి బ్యానర్లను కావాలని తొలగించారని ఉగాది, రంజాన్ వరకు టైం ఉన్న కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరించడంపై బీఆర్ఎస్ నేత శివరాజ్ మండిపడ్డారు.