మహబూబ్‌నగర్, మే 27 : కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను గద్దె దించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ భవనంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పార్లమెంట్ స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని తెలంగాణ చౌరస్తాతోపాటు పలు ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వంగపల్లి శ్రీనివాస్ మాదిగతోపాటు అధికార ప్రతినిధి మల్లెపోగు శ్రీనివాస్ మాదిగ మాట్లాడారు. మనువాద బ్రాహ్మణ సిద్ధాంతాలతో దళిత అణగారిన వర్గాలను విద్య, ఉపాధి, రాజకీయ, ఆర్థిక రంగాలకు దూరం చేస్తున్నదన్నారు.
బీజేపీ తమ శాశ్వత శత్రువని వారు పేర్కొన్నారు. దళితులపై నిత్యం దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మతవిద్వేషాలతో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ కమలం పార్టీ ప్రజలను మోసం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇది సరికాదన్నారు. బీజేపీని గ్రామగ్రామానా అడ్డుకోవాలని, అప్పుడే మనకు మంచి రోజులు వస్తాయన్నారు. అంతకుముందు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకటయ్య, జిల్లా కార్యదర్శి నరేశ్, రాష్ట్ర కార్యదర్శి మైబన్న, నాయకులు జయన్న, రఘు, చెన్నమ్మ, కృష్ణరవి, సాయికుమార్, యాదగిరి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.