గద్వాలటౌన్/పెబ్బేరు రూరల్, మే 27: ఉష్ణతాపం పెరగడంతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. ఎన్నడు లేనంతగా ఈ ఏడాది ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏ కొద్ది నిర్లక్ష్యం వహించినా సూర్యుడి ప్రతాపానికి గురై ఇబ్బందులు పడకతప్పదు. మరోవైపు వడగాలులు వెరసి వడదెబ్బ తగిలి అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బకు అప్రమత్తతే అసలైన మందు. ఏకొద్ది లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా దగ్గర్లోనే ఏదైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేయించుకోవడం ఉత్తమం. దానికి సంబంధించిన మందులు ప్రస్తుతం ఆరోగ్య కేంద్రాల్లో, దవాఖానల్లో అందుబాటులో ఉన్నాయి. అప్రమత్తంగా వ్యవహరించి మన ఆరోగ్యంతోపాటు ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
తీసుకోవాల్సిన చర్యలు
వడదెబ్బ తగిలినట్లు గుర్తించిన వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి. అనంతరం ఎక్కువగా నీరు తాగించాలి. శరీర ఉష్ణోగ్రతలు తగ్గించడానికి తడి వస్త్రంతో శరీరాన్ని తడపాలి. వీలైనంత త్వరగా దగ్గర్లోని దవాఖానకు తీసుకెళ్లేలా చూడాలి.
అందుబాటులో మందులు
ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వడదెబ్బ నివారణ మందులు అందుబాటులో ఉన్నాయి. ఏ కొద్ది వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే ఆరోగ్యకేంద్రాల్లో చికిత్స చేయించుకోవడం మంచిది. ప్రతీ ఆరోగ్య కేంద్రంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, స్లైన్ బాటిళ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య కేంద్రాలతో పాటు అర్బన్ హెల్త్ సెంటర్లలో ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల వద్ద అందుబాటులో ఉంచారు.
ముందస్తు జాగ్రత్తలే మేలు
వడదెబ్బ నివారణకు ముందస్తు జాగ్రత్తలే మేలని వైద్యులు సూచిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలోని నీటిశాతం తగ్గిపోతుంది. దీంతో వడదెబ్బకు తరుచుగా గురయ్యే ప్రమాదం ఉంది. ఇందుకుగానూ తరచుగా ఉప్పు పంచదార, నిమ్మకాయ కలిపిన నీటిని లేదా ఉప్పు, పంచదార కలిపిన నీటినైన తాగుతూ ఉండాలి. మజ్జిగ, కొబ్బరి బోండాలు తాగడం మరింత మంచిది. ఎండలో చాలా సేపు పనిచేసే ఉపాధి కూలీలు కాని ఇతర కూలీలుకాని వీలైనంతా మేరకు మధ్యాహ్నం పనులు తగ్గించుకుని చల్లని సమయంలో పనులు పూర్తి చేసుకోవడం మంచిదని వైద్యుల అభిప్రాయపడుతున్నారు.
అవగాహన కల్పిస్తున్నాం
వడదెబ్బ నివారణపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పిస్తున్నాం. జిల్లా దవాఖాన, ఎంసీహెచ్తో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లలో సేవలు అందుబాటులో ఉన్నాయి. నివారణ మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. వడదెబ్బపై ప్రచారం నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
– చందూనాయక్, ఇన్చార్జి డీఎంహెచ్వో, జోగుళాంబ గద్వాల