నారాయణపేట రూరల్, ఏప్రిల్ 27: గొల్ల,కురుమలు ఆర్థికంగా ఎదిగేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. నారాయణపేట మండలంలోని కొల్లంపల్లి గ్రామంలో శుక్రవారం గొల్ల,కురుమలకు గొర్రెలు పంపిణీ చేసి అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాలను ఆదుకొంటుందన్నారు. ఇప్పటికే రెండు దశల్లో గొర్రెలు పొందిన లబ్ధిదారులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారన్నారు. జిల్లాకు 11వేల 55యూనిట్లు మంజూరయ్యాయన్నారు. పేటకు మంజూరైన 2,293 యూనిట్లలో 1,142 యూనిట్ల ద్వారా 22వేల గొర్రెలను లబ్ధిదారులకు అందజేశామన్నారు.
ఒక్కో యూనిట్‌కు రూ.లక్షా 58 వేలు ఖర్చు చేస్తున్నామన్నారు. వెటర్నరీ వైద్యులు సమయానికి స్పందించడం లేదని తమ దృష్టికి వచ్చిందని అలా జరగకుండా చూడాలని జిల్లా వెటర్నరీ వైద్యాధికారిణి సురేఖకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ సాయిరెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, పీఏసీసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్, ఉపసర్పంచ్ వడెప్ప, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేపూరి రాములు, వైద్యులు అనిరుధ్ ఆచార్య, శ్రీనివాస్, రాఘవేందర్‌గౌడ్ పాల్గొన్నారు.