నారాయణపేట, మే 25 : ఉద యం, సాయంత్రం వేళల్లో, సెలవు రో జుల్లో, వారాంతాల్లో చిన్నారులు ఆడుకునేందుకు.., పెద్దలు సేదతీరేందుకు పార్కులు ఎంతగానో దోహదపడుతున్నాయి. టీఆర్ఎస్ సర్కార్ అన్ని పట్టణాల్లో పార్కులు ఏర్పాటు చేస్తున్నది. పార్కులు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సైన్స్, చిల్డ్రన్ పార్క్‌లు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెంచర్లో ఒక ఎకరం 7 గుంటల భూమిలో రూ.1.45 కోట్ల వ్యయంతో సైన్స్ పార్క్ ఏర్పాటు చేశారు. ఇందులో గ్రీనరీతోపాటు చిన్నారులు ఆడుకునే బొమ్మలు ఆకట్టుకుంటున్నాయి. చిన్నారుల్లో సైన్స్‌పై అవగాహన కల్పించేలా సైన్స్ పరికరాలతోపాటు గోడలపై గుర్తులను ఏర్పాటు చేశారు. చదరంగం, వైకుంఠపాళి, లెక్కల గుణింతాలకు సంబంధించిన ఆకృతులను నిర్మించారు. అలాగే పెద్దలు వాకింగ్ చేసేందుకు ట్రాక్‌లను సిద్ధం చేశారు.
అదే విధంగా ఎస్పీ ఆఫీస్‌కు ఎదురుగా ఉన్న సాయివిజయ కాలనీలో ఉన్న మరో లే అవుట్లో దాదాపు అర ఎకరా స్థలంలో రూ.90లక్షల వ్యయంతో నిర్మించిన చిల్డ్రన్ పార్క్‌లో చిన్నారులు ఆడుకునే అనేక పరికరాలను ఏర్పాటు చేశారు. విమానం, జారుడుబల్ల, డైనోసార్ జారుడు బల్ల వంటి ఆకట్టుకునే బొమ్మలు ఉన్నాయి. సాయంత్రం వేళలో చిన్నారులు ఈ రెండు పార్క్‌ల్లో ఎంజాయ్ చేస్తున్నారు. వారంతపు సెలవుల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అక్కడే గడుపుతున్నారు. ఈ పార్క్‌లను గతేడాది జూలై 10న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
కాగా, బీసీ కాలనీ సమీపంలో రూ.2 కోట్లతో ఏర్పాటు చేస్తున్న మరో పార్క్‌కు మే 9న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఎస్పీ ఆఫీస్ పక్కన ఉన్న లే అవుట్లో రూ.60 లక్షల వ్యయంతో సీనియర్ సిటిజన్ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండు పార్కులో ఓపెన్ జిమ్ సౌకర్యం కల్పించనున్నారు. పార్క్‌ల ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ హరిచందన, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయలకు పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
స్నేహితులతో కలిసి వెళ్తున్నాం..
జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్, సైన్ పార్క్‌లకు స్నేహితులతో కలిసి వెళ్తున్నాం. గతంలో ఇంటి ఆవరణలో లేదా స్నేహితుల ఇంటికి వెళ్లి ఆడుకునేవాళ్లం. ప్రస్తుతం పార్క్‌లను ఏర్పాటు చేయడంతో అక్కడికి వెళ్లి ఉల్లాసంగా గడుపుతున్నాం. పిల్లలు ఆడుకునేందుకు అనేక రకాల పరికరాలు అందుబాటులో ఉన్నాయి.
– శ్రీనిధి రెడ్డి, 8వ తరగతి, నారాయణపేట
జారుడుబల్లలు బాగున్నాయి..
సైన్స్ పార్క్‌లో డైనోసార్ ఆకృతిలో ఏర్పాటు చేసిన జారుడుబల్ల బాగుంది. గతంలో ఇంటి వద్దే ఆడుకునేవాడిని. ప్రస్తుతం అమ్మానాన్నతో కలిసి పార్క్‌కు వెళ్తున్నాను. వేసవి సెలవులు ఉన్నందున ఎక్కువ సమయం పార్కులో సరదాగా గడుపుతున్నాను.
– ఇంద్రేష్ వరుణ్, 4వ తరగతి, నారాయణపేట
వినోదాన్ని అందిస్తున్నాయి..
పట్టణంలో ఏర్పాటు చేసిన పార్కులు విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి. పిల్లలతో కలిసి పార్క్‌లకు వెళ్తున్నాం. ఒత్తిడితో కూడిన జీవన ప్రయాణంలో పార్క్‌లు మానసిక ప్ర శాంతతనిస్తున్నాయి. పట్టణంలో పార్కుల ఏ ర్పాటుకు ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అనసూయ కృషి అభినందనీయం.
– సౌభాగ్య, నారాయణపేట
వాకింగ్ ట్రాక్ సూపర్..
పట్టణంలో ఏర్పాటు చేసిన పార్కులు పిల్లలకే కాకుండా పెద్దలు కాలక్షేపం చేసేందుకు కూడా అనువుగా ఉన్నాయి. పెద్దల కోసం సైన్స్ పార్క్‌లో ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్ సూపర్‌గా ఉన్నది. ఈ పార్కులకు పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడడా వస్తున్నారు. వారాంతంలో కుటుంబ సభ్యులతో వెళ్లి సరదాగా గడుపుతున్నాం.
– తిప్పన్న, నారాయణపేట