దామరగిద్ద, మే 25: తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేయడంతోపాటు వివిధ కులవృత్తుల వారికి కూడా చేయూతనిస్తున్నది. అందులో భాగంగా బెస్త వారి ఉపాధికోసం చెరువుల్లో చేపలు వదలడంతో పాటు, రజకులు, నాయిబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. అన్ని కులాల, కుల వృత్తి చేసుకునే వారికి సహాయం సహకారాలు అందిస్తూ తోడ్పాటునందిస్తున్నది. గ్రామాల్లోని కటింగ్ షాపులు, ఇస్త్రీ దుకాణాలకు ఉచిత విద్యుత్ అందించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బొగ్గులు దొరకవు..
ఈ రోజుల్లో బట్టలు ఇస్త్రీ చేయాలంటే ప్రధానంగా బొగ్గులు అవసరం. కాని బొగ్గులు దొరకడం కష్టంగా మారింది. కేసీఆర్ సారు ఉచిత విద్యుత్ అవకాశం కల్పించిన తర్వాత చాలా మేలైంది. కరెంట్ బిల్లు పైసలు మా పిల్లల చదువులకు ఉపయోగపడుతున్నాయి.
– చాకలి హన్మమ్మ
మా బతుకుల్లో వెలుగులు
ఆధునిక హెయిర్ ైస్టెల్స్ కోసం యువతకు నచ్చినట్లు కటింగ్ చేయాలంటే కరెంట్ అవసరం. వివిధ రకాల ట్రిమ్మర్లు వాడుకోవాలంటే విద్యుత్ ఉపయోగపడుతుంది. మాకు కరెంట్ బిల్లు మాఫీ చేసి పెద్దసారు కేసీఆర్ మా బతుకుల్లో వెలుగులు నింపారు. ఉచితంగా మీటర్లు పెట్టి బిల్లులు కూడా ప్రభుత్వమే భరించడం చాలా సంతోషం.
– మంగలి రవి