మహబూబ్‌నగర్‌టౌన్, మే 25: పట్టణాలు, నగరాల్లో పిల్లలు, యువత మానసిక శారీరక ఆరోగ్యం పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. పట్టణ ప్రగతి రెండో విడుతతో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది. మొదటి విడుతలో ప్రధానంగా వాకింగ్ ట్రాక్స్, ఓపెన్జిమ్స్ను ఏర్పాటు చేశారు. వీటితో పాటు శ్మశాన వాటికలు, పార్కులు, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించారు. జూన్ 3నుంచి మొదలు కానున్న పట్టణ ప్రగతి-2లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో ఎక్కడ కూడా పూర్తిస్థాయి సదుపాయాలతో క్రీడా సౌకర్యాలు లేవు. వీటిని దృష్టిలో పెటుకున్న ప్రభుత్వం అన్ని నగరాలు,పట్టణాల్లోని వార్డులో తప్పనిసరిగా క్రీడా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ అన్ని మున్సిపాలిటీలకు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 2 నాటికి క్రీడా ప్రాంగణాలకు స్థలాలు గుర్తించాలని నిర్దేశించారు.
స్థలాలు గురించాం..
కలెక్టర్ వెంకట్రావు ఆదేశాల మేరకు క్రీడా ప్రాంగణాలకు స్థలాలు గుర్తించాం. ఎదిర, బోయపల్లి, వీరన్నపేట డబుల్బెడ్రూం, క్రిస్టియన్‌పల్లి డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం వద్ద రెవెన్యూశాఖ సహకారంతో స్థలాలు గుర్తించాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం.
– ప్రదీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్