వడ్డేపల్లి, మే 20 : సమాజం బాగుండాలనే తపన ఉంటే చాలదు.. అందుకు తనవంతు కృషిచేయాలి.. అంటే దృఢ సంకల్పం ఉండాలని అదేబాటలో నడుస్తున్నాడు కలుగొట్ల శేషు. యూత్‌ఫర్ పబ్లిక్ అనే పేరుతో శాంతినగర్‌లో ఉచిత శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి శభాష్ అనిపించుకుంటున్నాడు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం కలుగొట్లకు చెందిన ఆర్వీ శేషు డిగ్రీ వరకు చదువుకున్న నిరుద్యోగి. జీవనోపాధి కోసం కంప్యూటర్ సర్వీస్ సెంటర్ నడుపుతున్నాడు. ఆపదలో ఉన్న వారికి, నిస్సహాయులకు, నిరుపేదలకు సహాయ సహకారాలు చేస్తుంటాడు. అదేవిధంగా నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించడానికి శాంతినగర్‌లో 100రోజులపాటు ఉచితంగా శిక్షణా కేంద్రం ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పిస్తున్నాడు.
అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ, మెళకువలు
రాష్ట్ర ప్రభుత్వం సుమారు 80వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో మారుమూల గ్రామాల్లోని పేద నిరుద్యోగులు సైతం ఉద్యోగ సాధనకు శిక్షణ పొందుతున్నారు. దూరప్రాంతాలకు వెళ్లి శిక్షణ పొందలేని వారి కోసం శాంతినగర్ అంబేద్కర్‌చౌరస్తాలో ఓ భవనం అద్దెకు తీసుకొని నిత్యం తరగతులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్-2, గ్రూప్-4, టెట్ తదితర ఉద్యోగాలకు ప్రత్యేక శిక్షకుల ద్వారా కోచింగ్ ఇప్పిస్తున్నారు. అదేవిధంగా కోచింగ్‌కు వచ్చే వారికి ఉచితంగా స్టడీ మెటీరియల్ కూడా అందజేయనున్నారు. పోలీస్ ఉద్యోగాలకు శిక్షణ పొందే వారికి పౌష్టికాహారంలో భాగంగా గుడ్లు అందజేస్తూ వారిలో ఫిట్నెస్ మెళకువలు నేర్పుతున్నారు. రాత పరీక్ష తర్వాత ఫిజికల్ టెస్ట్‌కు ప్రత్యేక ట్రైనర్ల ద్వారా శిక్షణ ఇపిస్తామని నిర్వాహకుడు శేషు తెలిపారు. శిక్షణకు వచ్చేవారిలో 600మంది మహిళలే ఉన్నారు. భవనం అద్దె, ట్రైనర్ల జీతాలు, మెటీరియల్ ఖర్చులు ఇలా సుమారు రూ.15లక్షల వరకూ భరిస్తూ వెయ్యిమంది ఉజ్వల భవిష్యత్‌కు తపన పడుతున్న శేషును ప్రతిఒక్కరూ శభాష్ శేషు అంటూ అభినందనలు తెలుపుతున్నారు. శాంతినగర్ ఎస్సై శ్రీనివాస్‌నాయక్ పోటీ పరీక్షలకు శిక్షణ పొందుతున్న వారికి లక్షాన్ని ఎలా సాధించాలి, పోటీని ఎలా ఎదుర్కోవాలి అనే విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు.
అందరూ బాగుండాలనే తపన
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉద్యోగాలను మూరుమూల గ్రామాల ప్రజలు కూడా దక్కించుకునేందుకు వెయ్యిమందికి 100రోజులు ఉచిత శిక్షణ ఇప్పిస్తున్నాను. దూరప్రాంతాలకు వెళ్లలేని మహిళా అభ్యర్థులు సద్వినియోగం చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. శిక్షణతోపాటు, ఫిజికల్ ట్రైనింగ్, రాత పరీక్షలు నిర్వహించి మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలనేది నా ఆకాంక్ష. కోచింగ్‌కు వచ్చేవారు కూడా అదే తపనతో చదవుతున్నారు.
– శేషు, యూత్‌ఫర్ పబ్లిక్ నిర్వాహకుడు
మా ఇంట్లో ఇద్దరు దివ్యాంగులు
మా ఇంట్లో నాన్న, మా సోదరుడు దివ్యాంగులు. ఎలాగైనా కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి వారికి సహాయంగా ఉండాలన్నదే నా లక్ష్యం. శాంతినగర్‌లో యూత్‌ఫర్ పబ్లిక్ ఉచిత శిక్షణ ఇస్తున్నారని తెలిసి ఇక్కడ చేరాను. తరగతులు బాగా చెబుతున్నారు. మాలాంటి వారికి సువర్ణావకాశం.
– మహేశ్, బుడమెర్సు
మహిళా అభ్యర్థులకు అవకాశం
దూరప్రాంతాలకు వెళ్లలేక పోటీపరీక్షలకు గతంలో దరఖాస్తులు కూడా చేసుకునేవారు కాదు. ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు తర్వాత వందల మంది అమ్మాయిలు, మహిళలు శిక్షణా కేంద్రానికి వచ్చి శిక్షణ పొందుతున్నారు. మెటీరియల్ కూడా ఇస్తామని చెప్పారు. మారుమూల గ్రామాల మహిళలకు మంచి అవకాశం.
– సనా, పుల్లూరు