మూసాపేట, మే 19: టీఆర్ఎస్ పాలనలో ప్రతి కుటుంబానికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని జానంపేట గ్రామంలో నిర్మించిన 80డబుల్ బెడ్రూం ఇండ్లను గురువారం లబ్ధిదారులకు మూసాపేట తాసిల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆల సమక్షంలో లక్కీడిప్ ద్వారా కేటాయించారు. లబ్ధిదారులే నేరుగా వెళ్లి వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటూ లక్కీడిప్ ద్వారా ఇంటిని ఎంచుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు మలిదశ ఉద్యమం నాటి నుంచి జానంపేటకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందే జానంపేట జాతీయ రహదారిపై తెలంగాణ రాష్ట్రం బోర్డు ఏర్పాటు చేసి ఉద్యమ స్ఫూర్తిని చాటుకున్నారని చెప్పారు. ఇండ్లు రానివారు ఎవరూ కూడా నిరుత్సాహ పడొద్దని, అర్హులందరికీ ఇండ్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు.
జానంపేట మొత్తం ఐక్యతతో టీఆర్ఎస్కు మద్దతిస్తున్నందుకు ప్రత్యేకంగా ఇండ్లను కేటాయించినట్లు తెలిపారు. ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో వాగులపై చెక్ డ్యాంలు నిర్మించడంతో భూగర్భ జలం పెరిగిందన్నారు. పచ్చదనం కూడా పెరగడంతో దేవరకద్రకు అవార్డు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పటికే కర్వెన ప్రాజెక్టు కూడా పూర్తయ్యేదని, కానీ మన ప్రాంత నాయకులే కోర్టుల్లో కేసులు వేసి పనులు ఆపారని గుర్తుచేశారు. కర్వెన పూర్తయితే ప్రతి గ్రామంలో సాగునీటి గోస తీరుతుందన్నారు.
ఈసందర్భంగా లబ్ధిదారులు, టీఆర్ఎస్ శ్రేణులు ఎమ్మెల్యే ఆల, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పాదాభివందనాలు తెలియజేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ గూపని కళావతికొండయ్య, తాసిల్దార్ మంజుల, నాయబ్ తాసిల్దార్ వరప్రసాద్, ఏఈ లక్ష్మణ్‌గౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు లక్ష్మినరసింహయాదవ్, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపీటీసీ ఆంజనేయులు, ఉపసర్పంచ్ అనిల్‌కుమార్‌రెడ్డి, శివరాములు, భాస్కర్‌గౌడ్, అచ్చాయిపల్లి చంద్రశేఖర్, ఎండీ సత్తార్ పాల్గొన్నారు.