చారకొండ, ఏప్రిల్ 10: రెండో అపర భద్రాదిగా పేరుగాంచిన శిరుసనగండ్ల సీతారామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగాయి. కల్యాణ వేడుకలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ముఖ్యఅతిథిగా హాజరైన విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు దంపతులను, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పండితుల వేదమంత్రాలు, భాజాభజంత్రీలు, భక్తుల జై శ్రీరాం నినాదాల మధ్య సీతారాముల కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఉదయం 8నుంచి సీతారాముల దర్శనానికి భక్తులు బారులుదీరారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కల్వకుర్తి డీఎస్పీ గిరిబాబు, వెల్దండ సీఐ రామకృష్ణ, చారకొండ ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. కల్యాణ మహ్మోత్సవంలో విరుపాక్ష విద్యారణ్య స్వామి, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి, జీబీఆర్ ట్రస్టు చైర్మన్ గువ్వల అమల, ఎంపీపీ నిర్మలాజేందర్గౌడ్, సర్పంచ్ యాతం శారదశ్రీను, సింగిల్ విండో చైర్మన్ గురువయ్యగౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గజ్జెయాదయ్యగౌడ్, ఆలయ చైర్మన్ రామశర్మ, ఈవో రఘు, వంగూరు ఎంపీపీ భీమమ్మలాలుయాదవ్, తాసిల్దార్ నాగమణి, ఎంపీటీసీ లక్ష్మణ్‌నాయక్, సర్పంచులు విజేందర్‌గౌడ్, ప్రశాంత్‌నాయక్, నరేశ్‌నాయక్, నరేందర్‌రెడ్డి, అనిశెట్టిశ్రీను, సుజాత, గోళిరంగారెడ్డితో పాటు మాజీ ధర్మకర్త దుర్గారెడ్డి, అర్చకులు, వివిధ పార్టీల నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.