
మహబూబ్‌నగర్ టౌన్, డిసెంబర్ 14 : పాలమూ రు విశ్యవిద్యాలయాన్ని పచ్చదనంగా తీర్చిదిద్దాలని సీఎంవో ఓఎస్డీ ప్రియాంకవర్గీస్ సూచించారు. మంగళవారం ఆమె జిల్లా కేంద్రంలోని పీయూను సందర్శించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలన్నారు. క్రీడామైదానాల ఏర్పాటుకుగానూ మొక్కలు తొలగిస్తే.. ఎన్ని తొలగించారో అన్ని మొక్కలు మళ్లీ నాటాలని వీసీకి సూచించారు. అనంతరం మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావు ఓఎస్డీని మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో పీయూ వీసీ లక్ష్మీకాంత్‌రాథోడ్, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ క్షీతిజ, డీఎఫ్‌వో గంగిరెడ్డి, పీయూ రిజిస్ట్రార్ పండి పవన్‌కుమార్, వీసీ ఓఎస్డీ మధుసూదన్‌రెడ్డి, ప్రిన్సిపాల్ నూర్జహాన్ తదితరులు పాల్గొన్నారు.
పుస్తకాలను అందుబాటులో ఉంచాలి..
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ సెల్ ద్వారా అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచాలని సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ సూచించారు. జడ్చర్ల బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన తెలంగాణ బొటానికల్ గార్డెన్‌ను ఆమె మంగళవారం సందర్శించారు. గార్డెన్లో పెరుగుతున్న మొక్కల గురించి తెలుసుకున్నారు. గార్డెన్ అభివృద్ధికి పాటుపడుతున్న సమన్వకర్త డాక్టర్ సదాశివయ్యను అభినందించారు. గ్రీన్‌హౌస్‌ను పరిశీలించారు. గార్డెన్లో ఏర్పాటు చేసిన వనజీవి రామయ్య వ్యూపాయింట్‌ను ప్రారంభించారు. గార్డెన్లో మొక్క నాటారు. వృక్షశాస్త్రం విభాగంలో ఏర్పాటు చేసిన విత్తన ప్రదర్శన, హెర్బేరియంలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులతో మాట్లాడారు. విద్యార్థులను సివిల్ సర్వీసెస్ దిశగా మార్గనిర్దేశం చేయాలని అధ్యాపకులకు సూచించారు. వేప చెట్లకు వస్తున్న వ్యాధిపై పరిశోధనలు జరుపుతున్న విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రవీందర్రావు, శ్రీనివాసులు, శ్రీనివాసరావు, డీటీ వెంకటేశ్వరి, ఫారెస్టు అధికారులు, కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.