గద్వాలటౌన్, ఆగస్టు 21: ఎల్లల్లో ఉండి రక్షించే తల్లి ఎల్లమ్మ(జములమ్మ)…ఎల్లచోట ఉండి ఎల్లవేళలా ప్రజలందరినీ కాపాడే తల్లి జములమ్మ తల్లి…నడిగడ్డ ఇలవేల్పుగా విరాజిల్లుతూ అఖండ భక్త జనంతో పూజలందుకుంటున్న తల్లి జములమ్మ…తల్లిని భక్తితో కొలిచిన వెంటనే సకల పాపాలు తొలగి శుభాలు కలుగుతాయి…ప్రతి ఏడాది మాఘమాసంలో అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి భక్తితో కొలుస్తారు…అయితే గతేడాది నుంచి అమ్మవారి కల్యాణోత్సవం నిర్వహించేందుకు పాలకమండలి శ్రీకారం చుట్టింది…ఈ ఏడాది కూడా కల్యాణోత్సవాన్ని వైభవంగా జరిపించేందుకు ఆలయాన్ని అన్ని విధాలా ముస్తాబు చేశారు.
అమ్మవారి కల్యాణోత్సవంలో భాగంగా సోమవారం సాయంత్రం 6గంటలకు జమ్మిచేడు గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఎదుర్కోళ్ల ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే గణపతి పూజ, దేవతాహ్వానం, అంకురార్పణ తదితర పూజలు ఉంటాయి. మంగళవారం ఉదయం 11.45గంటలకు జమదగ్ని, జములమ్మల కల్యాణోత్సవాన్ని జరిపిస్తారు. బుధవారం అమ్మవారిని పల్లకీపై ఊరేగిస్తారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై అమ్మవారికి పట్టు వస్ర్ర్తాలను సమర్పిస్తారు.
కల్యాణోత్సవానికి ఆలయాన్ని అన్ని విధాల ముస్తాబు చేశారు. అమ్మవారి, పరుశరాముడు ఆలయాలను, ఆలయ పరిసర ప్రాంతాలన్నింటికి కూడ విద్యుద్దీపాలతో అలంకరించారు. అలాగే జమ్మిచేడు గ్రామంలో ఆలయాలను ముస్తాబు చేశారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. భక్తులకు ఎలాంటి
ఇబ్బందులు కలుగకుండా ఆలయ పాలకమండలి, అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.