మిడ్జిల్, ఫిబ్రవరి 4 : మండలంలోని వేముల ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం బంద్ చేశారు. అయితే హెచ్ఎం, వంట ఏజె న్సీ వారి మధ్య గొడవ జరగడంతో వారు వంట చేయకుండా వెళ్లిపోయారు. దీంతో మధ్యాహ్న భోజనం నిలిచిపోవడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. కొంతమంది విద్యార్థులు ఇంటికి వెళ్లి భోజనాలు చేసి వచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పాఠశాలకు చేరుకొని ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీల మధ్య జరిగిన గొడవలో విద్యార్థులను పస్తులు ఉంచడం ఏంటని ప్ర శ్నించారు. ఈ విషయాన్ని వెంటనే ఎంఈవో సుధాకర్‌కు తెలుపగా ఎంఈవో, ఎంపీడీవో గీతాంజలి, కాంప్లెక్స్ ఉపాధ్యాయురాలు సరస్వతి పాఠశాలకు చేరుకొని వివరాలు తెలుసుకున్నారు.
అయితే వంటగది తాళం వంట ఏజెన్సీవారు ఇవ్వకపోవడంతో తాళం పగులకొట్టి ఉపాధ్యాయులే స్వయంగా వంట చేసి విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో ఐదు మంది ఉపాధ్యాయులు, 39 మంది విద్యార్థులకు గానూ 13 మంది విద్యార్థులు మాత్రమే పాఠశాలకు వచ్చారు. అయితే ఉపాధ్యాయులు, వంటఏజెన్సీల నిర్లక్ష్యంతో ఒంటిగంటకు భోజనం చేయాల్సిన విద్యార్థులు.. 3గంటల సమయంలో భోజ నం చేశారు. అనంతరం ఎంపీడీవో, ఎంఈ వో, కాంప్లెక్స్ హెచ్ఎం సమక్షంలో ఇరువురితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. మళ్లీ ఇలాంటి చర్యలు పునరావృతం కావొద్దని సూచించారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం గా వ్యహరించిన హెచ్ఎం, వంట మహిళలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిందండ్రులు కోరారు.