జూరాల ప్రాజెక్టు ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో కృష్ణా నది ఉరకలేస్తున్నది. దీంతో జూరాల ప్రాజెక్టుకు వరద వస్తున్నది. ఆదివారం 31,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా.. 37,434 క్యూసెక్కులను వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే జూరాల నుంచి కాల్వలు, ఎత్తిపోతలకు నీటిని విడుదల చేస్తున్నారు. కాగా, ప్రాజెక్టు నుంచి 41,973 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కులకు పైగా వరద వస్తున్నది. తుంగభద్ర జలాశయానికి దాదాపుగా 60 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. జూరాల పవర్‌హౌస్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో సోమవారం శ్రీశైలం జలాశయాన్ని కృష్ణమ్మ ముద్దాడనున్నది. మదనాపురం మండలంలోని భీమాఫేజ్-1 ఎత్తిపోతలకు కృష్ణాజలాలు రావడంతో రామన్ పాడు కాల్వ నుంచి రెండు మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. మక్తల్ మండలం చిన్న గోప్లాపూర్ పంప్‌హౌస్ నుంచి పంపింగ్ ప్రారంభించారు. ఇదిలా ఉండగా, స్థానికంగా కురుస్తున్న వర్షాలతో దుందుభీ నది ఉధృతంగా ప్రవహిస్తున్నది.
గద్వాల, జూలై 23 : జిల్లాలో ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవనప్పటికీ కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. అనుకున్న స్థాయిలో వర్షాలు లేకపోవడంతో జూరాల అడుగంటిపోగా రైతులు ఆందోళన చెందారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడుగా ఎగువ నుంచి వరద వస్తుండడంతో జూరాల జలకళను సంతరించుకున్నది. గురువారం వరకు ప్రాజెక్టులో 1.977 టీఎంసీల నీరు ఉండగా శనివారం మధ్యాహ్నం 28,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. సాయంత్రం వరకు 34వేల క్యూసెక్కులకు పెరిగింది. ఆదివారం ఉదయం నుంచి జూరాలకు 36వేల క్యూసెక్కుల వరద నిరంతరంగా వస్తుండగా.. మరింత పెరిగే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా డ్యాంలో ప్రస్తుతం 5.242 టీఎంసీల నీరు ఉంది. ఆదివారం రాత్రి 9గంటలకు ఎగువ నుంచి 31,200 క్యూసెక్కులు వస్తుండగా.. విద్యుత్ ఉత్పత్తికి 37,434 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అదేవిధంగా నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 1,500, భీమా లిఫ్ట్-1కు 1300, లెఫ్ట్ కెనాల్‌కు 820, ప్యారలల్ కెనాల్‌కు 850, భీమా లిఫ్ట్-2కు 750 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం అవుట్ ఫ్లో 41,973 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాలకు వరద రావడంతో జిల్లా ప్రజలు సంబుర పడుతున్నారు.
సాగుకు ఊతం..
జూరాలకు వరద చేరుతుండడంతో సాగుకు ఊతం ఇచ్చినైట్లెంది. జూరాల కుడికాలువ కింద ఉన్న రైతులు వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పొలాలను చదును చేసి ఉంచగా నీరు కాలువలకు వదిలితే వెంటనే కరిగెట పనులు ప్రారంభించి నాట్లు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. బోరుబావుల కింద రైతులు ఇప్పటికే నారుమడులు సిద్ధం చేసి ఉంచారు. వరద రావడంతో అన్నదాతలు నాగళ్లకు పదును పెట్టారు. రెండు, మూడు రోజుల్లో వ్యవసాయ పనులు పూర్తి చేసి నాట్లకు పొలాలను సిద్ధం చేస్తున్నారు. నదికి వరద వస్తుండడంతో నడిగడ్డ పులకరించిపోతున్నది. నీరు అనుకున్న సమయంలో పొలాలకు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తుండడంతో ఈసారి రైతులు సెంటు భూమి వదలకుండా సాగుకు సిద్ధమవుతున్నారు.