వనపర్తి పట్టణం ఐటీ సొబగులు అద్దుకోనున్నది. రూ.10 కోట్లతో ఐటీ టవర్ నిర్మించేందుకు అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండో ఐటీ హబ్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వనపర్తి నియోజకవర్గంలో రూ.666కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ఈ నెల 29వ తేదీన ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. రూ.73 కోట్లతో బైపాస్ రహదారి, రూ.2.75 కోట్లతో నిర్మించనున్న బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.425 కోట్లతో ప్రత్యేక మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాజాపేటలో నిర్మించిన 96 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. రూ.75 లక్షలతో నిర్మించిన ఆచార్య జయశంకర్ పార్క్, కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాగా, మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి భారీగా ఏర్పాట్లు చేపడుతున్నారు. బహిరంగ సభకు ప్రజలను భారీగా తరలించేలా బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా దశ దిశ మారుతున్నది. కరువు కాటకాలు, ఆకలి చావులకు నిలయమైన పాలమూరులో క్రమక్రమంగా విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. పరిశ్రమలకు రాచబాట పడుతున్నది ఇప్పటికే మహబూబ్‌గర్ జిల్లా కేంద్రంలో నిర్మించిన ఐటీ టవర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలతో కళకళలాడుతుంది. ఇదే బాటలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వనపర్తి జిల్లా ప్రజలకు చిరస్మరణీయ కానుకగా మరో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. రూ.10కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌కు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా వనపర్తి నియోజకవర్గంలో సుమారు రూ.666కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.
మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి వీటికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ మేరకు కేటీఆర్ పర్యటన విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కలెక్టర్ నేతృత్వంలో అధికారుల బృందం కేటీఆర్ పర్యటించే ప్రాంతాలను పరిశీలించి పనులు ప్రారంభించారు. హెలీప్యాడు, బహిరంగ సభ వేదికను ఖరారు చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలో కనీవిని ఎరుగని రీతిలో కేటీఆర్ సభను నిర్వహించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు జన సమీకరణ పనుల్లో నిమగ్నమయ్యారు. వెనుకబడిన వనపర్తి ప్రాంతం ఇప్పటికే విద్యాపర్తిగా భాసిల్లుతున్నది. రాష్ట్రంలో ఎక్కడాలేని కళాశాలలు ఇక్కడ వెలిశాయి. నిరంజన్‌రెడ్డి చొరవతో జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి సుమారు రూ.666కోట్లతో ఇటీవల వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. త్వరలో ఐటీ నిర్మాణానికి బీజం పడితే ఊహించని విధంగా ఇక్కడి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
సభ విజయవంతానికి బీఆర్ఎస్ శ్రేణుల సన్నాహాలు..
వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానం, గంజ్‌లో టౌన్ హాల్, సమీకృత మార్కెట్, మెడికల్ కళాశాల ప్రాంతాలను పరిశీలించి అధికారులకు కేటీఆర్ పర్యటన, బహిరంగసభ ఏర్పాట్లపై వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధికారులు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వనపర్తి పట్టణంలో నిర్వహించే బహిరంగ సభకు పెద్దఎత్తున జనాలను తరలించాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో కేటీఆర్ పర్యటన ఆసక్తి రేపుతోంది. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు కనీసం రోడ్డు వెడల్పు కూడా చేయలేని అసమర్థ పాలనకు మంత్రి నిరంజన్‌రెడ్డి చరమగీతం పాడారు. జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ పట్టణ స్వరూపాన్ని మార్చివేసింది. జిల్లాలో తాగునీటి ఇబ్బందులు లేకుండా రూ.425కోట్లతో ఏకంగా ప్రత్యేక మిషన్ భగీరథ పథకం పనులు శరవేగంగా పూర్తి వేయించారు. వనపర్తి జిల్లాలో ఎక్కడాలేని విద్యాసంస్థలను తీసుకొచ్చి ఎంతోమంది నిరుపేద విద్యార్థులు ఇక్కడే చదువుకునే వెసులుబాటు కల్పించారు.
ఐటీ హబ్‌తో మారనున్న వనపర్తి రూపురేఖలు..
రూ.10కోట్ల వ్యయంతో వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసే ఐటీ హబ్ రూపురేఖలను మార్చివేస్తుంది. పట్టణాలకు ఐటీని విస్తరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చిన్న, చిన్న పట్టణాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఐటీ ఏర్పాటు చేస్తున్నది. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో ఐటీ హబ్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ పచ్చజెండా ఊపారు. అంతేకాకుండా టీయూఎఫ్ఐడీసీ కింద వనపర్తి, పెబ్బేర్లకు రూ.55కోట్ల మంజూరు చేశారు. దీంతో మంత్రి కేటీఆర్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
Minister Niranjan Reddy
అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటా..
ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేశారు. ప్రజలిచ్చిన అవకాశంతో వనపర్తి అభివృద్ధికి ఎంతో కృషి చేశాను. కేవలం ఐదేండ్ల కాలంలోనే 60ఏండ్ల అభివృద్ధి చేసిచూపించాం. సీఎం కేసీఆర్ మంత్రిగా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయ శాఖకు వన్నె తెచ్చా. ప్రజలు ఆశీర్వదించి మరోసారి గెలిపిస్తే వనపర్తి బలమైన భవిష్యత్‌కు పునాది వేస్తా. ఈనెల 29న మంత్రి కేటీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశాం. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధికసంఖ్యలో బహిరంగసభకు తరలిరావాలి.
– సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి
మంత్రి కేటీఆర్ పర్యటన షెడ్యూల్..