అయిజ, మార్చి 5 : అంతర్రాష్ట్ర ఒంటెద్దు బండ్ల గిరక పోటీలు ఉత్సాహభరితంగా జరిగాయి. పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో మంగళవారం అంతర్రాష్ట్ర ఒంటెద్దు బండ్ల గిరక పోటీలు నిర్వహించారు. పోటీలకు వివిధ రాష్ర్టాల నుంచి 21 వృషభరాజములు తరలివచ్చాయి. ఒంటెద్దు బండ్ల గిరక పోటీల్లో ధరూర్ మండలం మన్నాపురం గ్రామానికి చెందిన తిమ్మన్న వృషభరాజము 270.11 అడుగుల దూరం లాగి మొదటిస్థానంలో నిలువగా, కర్నూల్ జిల్లా కేంద్రంలోని బంగారుపేటకు చెందిన మద్దిలేటి వృషభరాజము 198 అడుగుల దూరంలాగి రెండోస్థానంలో నిలిచింది.
మన్నాపురం గ్రామానికి చెందిన ఖలీం వృషభరాజము 187.7 అడుగుల దూరం లాగి మూడో స్థానంతో సరిపెట్టుకున్నది. వృషభరాజముల యజమానులకు ఆలయ కమిటీ సభ్యులు నగదు బహుమతులను అందజేశారు. పోటీలను తిలకించేందుకు రైతులు అధిక సంఖ్యలో తరలొచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.