కొల్లాపూర్ : ఆర్ఎస్ఎస్ ( RSS ) ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా కొల్లాపూర్ పట్టణ రాష్ట్రీయ స్వయం సేవకులు పట్టణంలో పద సంచాలన్ నిర్వహించారు. ఏడు రోజులుగా శిక్షణ తీసుకున్న స్వయం సేవకులు మొత్తం 356 మంది కొల్లాపూర్( Kollapur ) పుర వీధుల గుండా డాక్టర్ జీ, గురూజీ, భారత మాత చిత్రపటాలతో అలంకరించిన వాహనంతో దేశభక్తి గీతాల ఆలాపనతో కవాత్ నిర్వహించారు. మహబూబ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉగాది ఉత్సవంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శశికాంత్ వాల్మీకి ( Shashikant Valmiki ) మాట్లాడుతూ నిస్వార్థ జీవనాన్ని కొనసాగిస్తూ, దేశమాతను కొలుస్తూ, త్యాగనిరతిని కలిగి ఉండే సంఘ్ కార్యకర్తలే అసలైన దేశభక్తులని కొనియాడారు. వ్యక్తి శీలమే జాతి ప్రగతికి మూలమని, వ్యక్తి లో నైతికత పెరగటమే అసలైన దేశ అభివృద్ధి అన్నారు.
పాలమూరు విభాగ్ సంఘచాలక్ ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ప్రవర్తన, పరివర్తన కోసం వంద సంవత్సరాలుగా దీర్ఘ కాలిక లక్ష్యంతో పనిచేస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఎన్నో త్యాగాలకు నిలయంగా నిలిచిందని పేర్కొన్నారు. సమాజం, సామాజిక సామరస్యతను పాటిస్తూ, కులరహితమైన సమాజాన్ని ఏర్పరచాలని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఏర్పరచాలని, కుటుంబ వ్యవస్థను క్షీణించకుండా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా నాయకులు
ఆగపు నాగయ్య, కొల్లాపూర్ సంఘ బాధ్యులు, స్వయంసేవకులు పాల్గొన్నారు.