అచ్చంపేట : గిరిజన ప్రజల వ్యవసాయ భూములకు నీటి సౌకర్యంతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పించి వారి భూములలో ఉద్యాన పంటలు ( Horticultural Crops ) సాగు చేసే విధంగా ఇందిరా సౌర గిరి జల వికాస పథకం అమలు చేయనున్నామని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ( Collector Badawat Santosh) పేర్కొన్నారు.
అమ్రాబాద్ మండలంలోని జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయంలో శనివారం ఉద్యానవన శాఖ, భూగర్భ జల శాఖ,ఐటీడీఏ, డీటీడీవో అధికారులు, జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ గోపిడి, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణతో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకంపై సమీక్షను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పైలెట్ ప్రాజెక్టుగా( Pilot Project) అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలంలోని మన్ననూరులో ప్రవేశపెట్టనున్న ఇందిరా సౌర గిరి జల వికాస పథకం అమలుకు ఎంపిక చేసిందని అన్నారు.
ఆర్వోఎఫ్ఆర్ ( ROFR ) పట్టా ఉన్నపోడు భూములు వర్షాధారం ద్వారానే సాగు చేస్తుండడం వల్ల గిరిజనులు అభివృద్ధికి నోచుకోవడం లేదని తెలిపారు. ఈ భూములకు నీటి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో బోరు బావులను త్రవ్వించి, సౌర విద్యుత్ సౌకర్యం కల్పించి, ఉద్యాన పంటలు సాగు చేసే విధంగా డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు ,వంటి పనులను ఈ పథకం ద్వారా గిరిజన రైతాంగానికి మేలు చేస్తాయని వివరించారు.
తక్షణమే భూగర్భ జల అధికారులు తమ బృందాలతో గ్రౌండ్ వాటర్ సర్వే జరిపి బోర్ బావులను సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు కావలసిన పండ్ల మొక్కలు, డ్రాగన్ ఫ్రూట్ , అవగాడ్రో, నిమ్మ, మామిడి వెదురు మొక్కలను సిద్ధం చేసుకోవాలని, డ్రిప్ పైపులను, స్పింకర్లను సరిపడినన్ని అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.
అనంతరం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో హెలిపాడ్ స్థలాన్ని జిల్లా ఎస్ పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ,డీఎఫ్వో రోహిత్ గోపిడి అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తో కలిసి పరిశీలించారు. మన్ననూరులో పైలెట్ ప్రాజెక్టుగా ఇందిరా సౌర గిరి జల వికాస పథకం మే 18న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.