అలంపూర్, డిసెంబర్ 10 : నిరుపేద కుటుంబాలు కార్పొరేట్ దవాఖానల్లో నాణ్యమైన వైద్యసేవలు పొందేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంను ప్రవేశ పెట్టిందని, ఈ పథకంను పేద కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాజీవ్ ఆరోగ్యశ్రీ చేయూత పథకంను లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి పేద కుటుంబానికి రూ.10 లక్షల వరకు సూపర్ స్పెషాలిటీ దవాఖానల్లో వైద్య సేవలు అందుతాయన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మనోరమా వెంకటేశ్, జిల్లా వైద్యాధికారి శశికళ, డీసీఈవో ముసాయిదా బేగం, సీఈసీ డాక్టర్ సయ్యద్ బాషా, ప్రోగ్రాం అధికారి రాజు, మానవపాడు ఎంపీపీ అశోక్, జోగుళాంబ ఆల య చైర్మన్ చిన్ని కృష్ణయ్య, వైస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహాలక్ష్మి పథకంలో భాగంగా వయసుతో సంబంధం లేకుండా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పించిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలో ఉచిత ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ప్రయాణికులకు జీరో టికెట్లను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమావెంకటేశ్తోపాటు డీఎం మం జుల తదితరులు పాల్గొన్నారు.
ఉండవెల్లి, డిసెంబర్ 10 : అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఆదివారం ఎమ్మెల్యే విజయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సమావేశపు హాలు, ఎమ్మెల్యే క్యాబిన్, వీఐపీల హాల్‌ను పరిశీలించి అన్ని ఏర్పాట్లు చేయాలని, అలాగే పెయింటింగ్ వేయడంతోపాటు ప్రహరీకి మరమ్మతులు చేయించి ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటాలని సిబ్బందికి సూచించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం త్వరలో క్యాంప్ కార్యాలయం నుంచి పాలన కొనసాగించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వెం ట పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.