ధన్వాడ, జూన్ 28 : ధన్వాడ పెద్ద చెరువు నుంచి టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇటుక బట్టీలకు ఒండ్రు మట్టిని తరలిస్తుండగా మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామోహ్మన్‌రెడ్డి శనివారం టిప్పర్లకు అ డ్డంగా తన కారును పెట్టి అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతుల పొలాలకు ఒండ్రుమట్టిని తరలించకుండా ఇటుక బట్టీలకు విక్రయించుకోవడం తగదని నీటిపారుదల శాఖ ఏఈ బ్రహ్మానందం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నారాయణపేట ఎమ్మెల్యే హైదరాబాద్‌లో ఉంటుండగా ఎమ్మెల్యే మేనమామ శివకుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పీఏ మాధవరెడ్డిలు అక్రమంగా ఇటుక బట్టీలకు ఒండ్రు మట్టిని తరలిస్తుంటే అధికారిగా మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
బ్రోకర్ల మాటలు వినడం తప్పా ఫీల్డ్ మీద ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత అధికారులకు లేదా అని మండిపడ్డారు. కొడంగల్ ఎత్తిపోతల ద్వారా ధన్వాడ చెరువుకు చుక్కనీరు కూడా రాదని, నీరు చెరువుకు రిజర్వాయర్ పేరుతో అక్రమంగా ఒం డ్రు మట్టిని తరలించి ఇటుకబట్టీలకు అమ్ముకుంటున్నారని, శివకుమార్‌రెడ్డి, మాధవరెడ్డిలు తమ మాట వినని ఆధికారులను బదిలీలు చేయిస్తూ ఆరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి అక్రమంగా నారాయణపేట నుంచి కొండంగల్కు నీటిని తరలించాలని చుస్తూంటే ఈ ప్రాంత ప్రజలు ఏం చేస్తున్నారని అన్నారు.
కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల పథకానికి కేంద్రం ఇంకా అనుమతులు ఇవ్వలేదని గుర్తు చేశారు. భీమా నీటిని తరలిస్తే మక్తల్ ప్రజలకు నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపేట ఎమ్మెల్యే నియోజవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరినా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని అన్నారు. అయితే టిప్పర్ల ద్వారా ఒండ్రు మట్టిని ఇటుక బట్టీలకు తరలించడం తప్పని అలాంటి టిప్పర్లను సీజ్ చేస్తామని నీటి పారుదల శాఖ ఏఈ చెప్పడంతో మాజీ ఎమ్మెల్యే శాం తించారు. మాజీ ఎమ్మెల్యే వెంట నారాయణపేట మాజీ ఎంపీపీ అ మ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, నాయకుడు కొండారెడ్డి తదితరులు ఉన్నారు.