మాగనూరు ( కృష్ణ ) అక్టోబర్ 10 : నష్ట పరిహారం ఇప్పిస్తారా లేక పురుగుల మందు తాగి చామంటారా, అంటూ సత్యసాయి తాగునీటి పంప హౌస్కు తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తున్న సంఘటన కృష్ణా మండల పరిధిలో గుడెబల్లూరు గ్రామ శివారులోని శ్రీ సత్యసాయి తాగునీటి పంప్ హౌస్లో చోటు చేసుకుంది. కృష్ణ మండలం పరిధిలోని గుడేబలూర్ గ్రామానికి చెందిన బుడమిల పార్వతి, కొడుకు మహేష్, శుక్రవారం గుడేబలూర్ గ్రామ శివారులోని ఉన్న శ్రీ సత్య సాయి తాగునీటి పంపు హౌస్ తాళం వేసి పురుగుల మందు డబ్బాతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ.. 2000 సంవత్సరంలో మా నాన్న 191 సర్వే నెంబర్ భూమిలో సత్యసాయి తాగునీటి పథకం నిర్మాణం కోసం 20 గుంటల భూమి ఇచ్చారని, ఐతే భూమి భరత్ మాల రోడ్డు పోవడంతో మేము ఎలాంటి లబ్ధి పొందలేదని తెలిపారు. మా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఒక ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే గత 25 సంవత్సరాల నుండి ఇప్పటివరకు ఎలాంటి హామీ నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే గత ఆరు నెలల నుండి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు మంత్రి వాకటి శ్రీహరితో పాటు కలవని అధికారులు లేరని, ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదని, అందర్నీ కలిసి కలిసి విసుగు చెందామని, అందుకే మా పొలంలో ఉన్న శ్రీ సత్యసాయి తాగునీటి పంప్ హౌస్కు తాళం వేసి పురుగుల మందు డబ్బాతో మాకు న్యాయం కోసం నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. మాకు న్యాయం జరిగితే సరే లేదంటే పురుగుల మందు సేవించి ఇక్కడే చనిపోతామని హెచ్చరించారు.
అయితే ఈ పంప్ హౌస్కు తాళం వేయడం వల్ల కృష్ణ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాలకు తాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందని అధికారులు స్పందించి, వారి సమస్యను త్వరగా పరిష్కరించాలని మండల ప్రజలు కోరారు. ఈ విషయంపై మిషన్ భగీరథ ఎస్సీ జగన్మోహన్ను వివరణ కోరగా గత 25 సంవత్సరాల కిందట వారి భూమి సత్యసాయి త్రాగునీటి పంప్ హౌస్ నిర్మాణం ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే అప్పటి అధికారులు, వారికి ఉద్యోగం ఇల్లు ఇస్తామని చెప్పారని వారు చెప్తున్నారు. కానీ అవి మాకు ఇవేవీ తెలియవని, ఇప్పుడు జిల్లా కలెక్టర్ దృష్టిలో పెట్టి వారి సమస్య సోమవారం పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.