గద్వాల, నవంబర్ 6 : ఆర్థిక, సామాజిక, రాజకీయ, వి ద్య, ఉపాధి కుల వివరాల ఇంటింటి కుటుంబ సర్వేను అధికారులు ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా చేపట్టాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలో నల్లకుంట, వీవర్స్కాలనీ, వడ్లవీధి, ధరూర్ మండలకేంద్రంలోని బీసీ కాలనీలో కుటుంబ సర్వే నిర్వహిస్తున్న తీరును బుధవారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఆ యా ఇండ్ల్లను సందర్శించి కుటుంబ సర్వే కోసం అతికించిన స్టిక్కర్లను పరిశీలించారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా పకడ్బందీగా సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 1,126 మంది ఎన్యుమరేషన్ బ్లాక్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వంటగది ఆధారంగా ఒక కుటుంబం భావించి సర్వే నిర్వహించాలని,పెండ్లిళ్లు అయినప్పటికీ అందరూ ఒకే గృహంలో ఉన్నైట్లెతే ఒకే కుటుంబంగా లెక్కించాలన్నారు. ఖాళీగా ఉన్న గృహలకు వేకెంట్ అనే స్టిక్కర్ తప్పనిసరిగా వేయాలన్నారు. గ్రామ కార్యదర్శులు, అంగన్వాడీలతోపాటు ఉదయం తమ విధులు నిర్వహించిన అనంతరం ఉపాధ్యాయులు మధ్యాహ్నం నుంచి సర్వేలో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, అధికారులు పాల్గొన్నారు.
గట్టు మండలంలో..
గట్టు, నవంబర్ 6 :మండలంలో కులగణన సర్వే బుధవారం ప్రారంభమైంది. ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన గ్రామాల్లో సర్వే నిర్వహించారు. ఆలూరులో జరిగిన సర్వేను మండల ప్రత్యేకాధికారి, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ జిల్లా ఏడీ గోవిందయ్య పర్యవేక్షించారు. సర్వే జరుపుతున్న తీరును పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చెన్నయ్య, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.
పకడ్బందీగా నిర్వహించాలి ; అదనపు కలెక్టర్ నర్సింగరావు
అయిజ, నవంబర్ 6 : సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు ఎన్యుమరేటర్లను ఆదేశించారు. మండలంలోని ఉప్పల, ఉత్తనూర్ గ్రా మాల్లో చేపట్టిన ఇంటింటి సర్వేను బుధవారం పరిశీలించి ప లు సూచనలు చేశారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికీ వెళ్లి కు టుంబ సభ్యుల వివరాలను తప్పులు లేకుండా నమోదు చే యాలన్నారు. ఒక ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు అన్నదమ్ములు ఉంటూ వంట వేర్వేరుగా చేసుకున్నట్లయితే ప్రత్యేకంగా నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటయ్య పాల్గొన్నారు.
ఇంటింటికీ స్టిక్కర్లు అంటిస్తున్న సిబ్బంది
వడ్డేపల్లి, నవంబర్ 6 : కుటుంబ సర్వేలో భాగంగా ప్రత్యేకంగా నియమించిన ఎన్యుమనేటర్లు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే ఇండ్లకు స్టిక్కర్లు అంటిస్తున్నారు. మూడురోజులు ఇదే కార్యక్రమం చేపడతామని 9నుంచి 24వ తేదీ వరకు పూర్తి వివరాలు సేకరిస్తామన్నారు. ఎంపీడీవో రామకృష్ణ గ్రామాల్లో పర్యవేక్షణ చేశారు. అయితే కొన్ని గ్రామాల్లో సర్వేకు ఎప్పుడు వస్తారనే సమాచారం సక్రమంగా ఇవ్వనందున కూలి పనులకు పోవాలా, ఇండ్ల వద్దే ఉండాలా అని రైతులు సంశయంతో పడ్డారు.
ఇటిక్యాల మండలంలో..
ఇటిక్యాల, నవంబర్ 6 : సమగ్ర కుటుంబ సర్వే బుధవారం మండలంలో ప్రారంభమైంది. మండల కేంద్రంతోపాటు నక్కలపల్లె గ్రామంలో చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని తాసీల్దార్ నరేందర్ పరిశీలించారు. ఉమ్మడి మండలంలో 15,312కుటుంబాలు ఉండగా ఎర్రవల్లి మండలంలో 51 బ్లాకులు, ఇటిక్యాల మండలంలో 38 బ్లాకులుగా విభజించినట్లు ఎంపీడీవో మహ్మద్ అజర్ మైయిద్దీన్ తెలిపారు. సర్వే చేపట్టేందుకు 89మంది ఎన్యుమరేటర్లు నియమించామని, వీరందరూ 8వ తేదీలోగా ఇంటింటి సర్వే చేపట్టి అదనంగా ఇంకా ఏవైనా కుటుంబాలు ఉన్నాయా అని గుర్తిస్తారని తెలిపారు. అనంతరం 9వతేదీనుంచి కుటుంబాల యొక్క పూర్తి సమాచారాన్ని ఎన్యుమరేటర్లు సేకరిస్తారని తెలిపారు. ఒక్కో ఎన్యుమరేటర్ 150నుంచి 175 కు టుంబాల పూర్తి సమాచారం సేకరించాల్సి ఉంటుందన్నారు.
సర్వేను పరిశీలించిన డీపీవో
మల్దకల్, నవంబర్ 6 : మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం సమగ్ర ఇంటింటి సర్వేలో భాగంగా అధికారులు గ్రామాల్లో తమకు కేటాయించిన ఇండ్లకు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్ల్లి కుటుంబ యజమాని వివరాలను అడిగి తెలుసుకొని ప్రతి ఇంటికి స్టిక్కర్ అతికించారు. ఈ సర్వేను డీపీవో శ్యాంసుందర్ పరిశీలించారు. మండలంలోని తాటకుంట, పెద్దపల్లి అమరవాయి గ్రామాల్లో నిర్వహిస్తున్న సర్వేను ఆయన పరిశీలించారు. ఈయన వెంట ఎంపీవో రాజశేఖర్ ,కార్యదర్శులు పాల్గొన్నారు. కుటుంబ సర్వేకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో ఆంజనేయరెడ్డి తెలిపారు. మండలకేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడుతూ మండలంలో మొత్తం 97 బ్లాకులు కాగా 14,961 ఇండ్లు ఉన్నాయి. సర్వేలో భా గంగా 6నుంచి 8వ తేదీ వరకు ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటిస్తున్న సిబ్బంది 9 నుంచి కుటుంబ వివరాలను సేకరిస్తారని తెలిపారు.