జయశంకర్ భూపాలపల్లి, మే 22 (నమస్తే తెలంగాణ)/ మహదేవపూర్: మండుతున్న ఎండలు సరస్వతీ నది అంత్య పుష్కర భక్తులపై ప్రతాపం చూపుతున్నాయి. భానుడి భగభగలకు జనం ఇంటి నుంచి అడుగు బయట పెట్టడానికి జం కుతున్నారు. ఎండ తీవ్రత 45, 46 డిగ్రీలు దాటుతుండడంతో జనం తట్టుకోలేకపోతున్నారు. ఉదయం 7 గంటలకే ప్రారంభమవుతున్న ఎండ వేడి సాయంత్రం ఆరు దాటినా తగ్గడం లేదు. మరోవైపు వడదెబ్బతో ప్రజలు అస్వస్థతకు గురికావడం, మృతి చెందే ఘటనలు జరుగుతుండడంతో ఆ ప్రభావం పుష్కరాలపై పడుతున్నది. గురువారం పుష్కరాల ప్రారంభం రోజున సుమారు 4 వేల వరకు భక్తులు హాజరుకాగా రెండో రోజు శుక్రవారం కొంత వరకు భక్తుల సంఖ్య పెరిగింది. అయితే, శుక్రవారం సాయంత్రం వరకు 74 ఆర్టీసీ బస్సుల ద్వారా 2,143 మంది పుష్కరాలకు చేరుకోగా ఎండ భయంతో ప్రైవేటు వాహనాల ద్వారానే మరో రెండు నుంచి మూడువేల మంది హాజరయ్యారు. చాలా మంది పుష్కర స్నానం చేసి ఆలయ దర్శనం చేసుకోకుండానే వెళ్లడం కనిపించింది. పుష్కర ఘాట్ వద్ద ఉన్న భక్తుల తాకిడి ఆలయంలో కనిపించలేదు. కాగా, రోజు రోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. కాగా, శుక్రవారం కాళేశ్వరంలో పర్యటించిన కలెక్టర్ రాహుల్ శర్మ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ పుషరాలను విజయవంతం చేయడంలో యంత్రాంగానికి సహకరించాలని భక్తులను విజ్ఞప్తి చేశారు. అంత్య పుషరాల్లో భాగంగా కాశీ పండితులతో నిర్వహిస్తున్న సరస్వతీ నవరత్న మాలా హారతి ప్రతి రోజూ రాత్రి 7.30 గంటల నుంచి దేశ, విదేశాల్లో నివసిస్తున్న భక్తులు వీక్షించడానికి వీలుగా సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. దాదాపు 45 నిమిషాల పాటు హారతి ఉంటుందన్నారు.
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు శుక్రవారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్ దంపతులకు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ పూజారులు పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దంపతులకు ఆశీర్వచనం అందించి, అమ్మవారి జ్ఞాపికను బహూకరించారు. అనంతరం వీఐపీ ఘాట్ వద్ద స్టాళ్లులో ఏర్పాటు చేసిన దసలి పట్టు వస్త్రాల స్టాల్‌ను సందర్శించారు.
అంత్య పుష్కరాల్లో సందర్భంగా సరస్వతీ ఘాట్ వద్ద నవరత్న మాల హారతి కార్యక్రమాన్ని కాసి వేదపండితుల ఆధ్వర్యంలో కనుల పండువగా నిర్వహించారు. త్రివేణి సంగమంలో ప్రత్యేకంగా తయారు చేసిన హంస వాహనంలో స్వామి వారి తెప్పోత్సవం నిర్వహించారు. వీఐపీ ఘాట్ వద్ద ప్రముఖ ప్రవచన కర్త బాచుపల్లి సంతోష్‌శాస్త్రి ధర్మ ప్రవచాలు భోధించారు. ఆలయ ఆవరణలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.