కొత్తకోట : వనపర్తి జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన వడగండ్ల (Hailstorm) వాన రైతులను నట్టేట ముంచింది. చేతికొచ్చిన వరి పంట ( Paddy crop) చేతికి అందకుండా పోయింది. కొత్తకోట మండల పరిధిలోని రాయినిపేట గ్రామంలో శనివారం రాత్రి ఈదురుగాలులతో అకాల వడగండ్ల వర్షం కురియడంతో పంట మొత్తం నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు ఎకరాలలో వరి పంట వేయగా మూడు ఎకరాలు పూర్తిగా వడగండ్ల వానకు నష్ట పోయిందని తెలిపారు. కోతకు వచ్చిన వరి పంట వర్షం కారణంగా గింజలన్నీ రాలి నీటిపాలయ్యిందని పేర్కొన్నారు. అకాల వర్షం వల్ల లక్ష వరకు నష్టం జరిగిందని తిరుపతి అనే రైతు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు , ప్రభుత్వం వెంటనే స్పందించి వడగండ్ల వానకు నష్టపోయిన రైతాంగానికి ఆర్థిక సహాయం ప్రకటించాలని కోరారు.