అయిజ : పట్టణంలో తిక్కవీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి తిక్కవీరేశ్వరుడికి ప్రభోత్సవం నిర్వహించారు. ఉదయం తిక్కవీరేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి శాంతి హోమం నిర్వహించారు. అటుపై అనంతరం ప్రభోత్సవంపై ఆశీనులై తిక్కవీరేశ్వరస్వామి భక్తులను కటాక్షించారు. నందికోల సేవ, భాజా భజంత్రీలు, రంగు రంగుల పటాకుల మోతల నడుమ తిక్క వీరేశ్వరస్వామి ప్రభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తుల శివ నామస్మరణల మధ్య తిక్క వీరేశ్వరస్వామి ఆలయం నుంచి ఆంజనేయస్వామి దేవాలయం వరకు ప్రభోత్సవాన్ని నిర్వహించారు. ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజల అనంతరం తిరిగి ఆలయం వరకు ప్రభోత్సవాన్ని తీసుకొచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రంగు రంగు విద్యుద్దీపాలతో అలంకరించారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక వంశీయులు లక్ష్మిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, యూత్, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు
తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం రాత్రి మహా రథోత్సవం నిర్వహణకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. రాత్రి 12 గంటలకు రధోత్సవం నిర్వహణకు రథాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. రంగు రంగుల విద్యుద్దీపాలంకరణ, పూలు, మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులతో రథాన్ని అలంకరిస్తున్నారు. రథోత్సవం వేళ నాగుపాము పడుగ, చెట్ల కొమ్మలతో కూడిన భారీ పటాకులను కాల్చనున్నారు. పటాకులను ప్రత్యేకంగా తయారు చేయించారు. రథోత్సవాన్ని పురష్కరించుకుని ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ టాటాబాబు నేతృత్వంలో ఎస్సై శ్రీనివాసరావు పట్టణంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.