మల్దకల్ : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేకపోవడంతో బుధవారం చెర్లగార్లపాడు స్టేజ్ వద్ద విద్యార్థులు, గ్రామస్తులు రోడ్డెక్కి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీలిపల్లి గ్రామం నుంచి ప్రతి రోజు 50 మంది విద్యార్థులు గద్వాల్, మల్దకల్ ఇతర ప్రాంతాలకు చదువు కోసం వెళ్తుంటారని ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చెర్లగార్లపాడు గ్రామం వరకు వచ్చే ఆర్టీసీ బస్సును నీలిపల్లి గ్రామం వరకు కొనసాగించాలని ఆర్టీసీ అధికారులను కోరారు. గతంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను ఆర్టీసీ అధికారులకు విన్నవించగా రేపు పంపిస్తాం ఎల్లుండి పంపిస్తాం అని నిర్లక్ష్యం చేస్తున్నారు. కాని ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించలేదన్నారు. అధికారులు స్పందించి బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.