అలంపూర్: శ్రీరామనవమి సందర్భంగా బియ్యపు గింజ పై శ్రీరామ నామాన్ని లిఖించి శ్రీ రాములవారి కల్యాణోత్సవంలో స్వామి వారి పాదాలు చెంత ఉంచడం, స్వామివారి కల్యాణం జరిగే అక్షింతలలో ఆ బియ్యాన్ని సమర్పించడం ప్రతి సంవత్సరం ఆనవాయితీ వస్తున్నది. ఈ నేపథ్యంలో జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పట్టణానికి చెందిన చక్రవర్తి ఆచార్యులు గత 15 సంవత్సరాలుగా బియ్యపు గింజపై శ్రీరామ నామాన్ని రాస్తూ రామభక్తిని చాటుకున్నారు. నిరంతరం భగన్నామస్మరణ, అందరి పట్ల సమభావం, భగవంతుని పట్ల అనంతమైన ప్రేమ గౌరవం, అలాగే కుటుంబ సంబంధాలు, ప్రతి మనిషి సమాజంలో ఎలా ఉండాలి, నిరంతరం అందరితో ఈ విషయాలన్నీ పంచుకుంటూ ప్రతి ఒక్కరిని భక్తి మార్గంలో నడిపిస్తూ, జీవిత గమనంలో భక్తే ప్రధానమని, తన వాగ్ధాటి, ఉచ్ఛారణతో, స్వామివారి సేవలో తరిస్తూ, నిరంతర భగవన్నమస్మరణతో 35 వేల బియ్యపు గింజలపై శ్రీరామ నామాన్ని నిరంతరంగా రాస్తూ అందరి చేత ప్రశంసింపబడుతున్నారు.
ఐజ మండలం తుపత్రాల గ్రామంలో రాముల వారి ఆలయంలో జరిగే కళ్యాణం ఉత్సవంలో ఈ కార్యక్రమాన్ని గత 15 సంవత్సరాలుగా భక్తి పూర్వకంగా నిర్వహిస్తూ గ్రామంలో అందర్నీ భక్తి మార్గంలో పయనించేటట్లు చేస్తూ, తన జీవితం కొనసాగిస్తున్నారు. ప్రతి మనిషి జీవన మార్గంలో భక్తి ప్రధానమైందని, నేటి యువత దుర్వ్యసనాలకు బానిసలు కాకూడదని, భారతీయ సంస్కృతి
సాంప్రదాయంలో, కుటుంబ వ్యవస్థ చాలా బలోపేతమైందని తల్లిదండ్రిని గౌరవించి వారు చెప్పిన మార్గంలో నడుచుకొని అత్యున్నత స్థానానికి ఎదగడానికి తోడ్పాటు అవుతుందని చక్రవర్తి ఆచార్యులు అన్నారు. శ్రీరామచంద్రమూర్తి తల్లి తండ్రి గురువులకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో గుర్తు చేశారు. నేటి ప్రజలకు అందరికీ శ్రీరామచంద్రమూర్తి ఎంతో ఆదర్శమని చెప్పారు. అలాగే మనకు పాఠశాలల్లో చదువులు చెప్పే గురువులను గౌరవించి, తగిన ప్రాధాన్యం ఇవ్వడం వల్ల నేటి యువత మంచి మార్గంలో పయనించే అవకాశం ఉందన్నారు.