అయిజ, సెప్టెంబర్ 8 : చిన్నోనిపల్లి రిజర్వాయర్ కట్ట ఎత్తు పెంచకపోవడంతో అయిజ మండలంలోని సింధనూర్, టీటీదొడ్డి గ్రామాలతోపాటు ఆర్డీఎస్ ప్రధానకాల్వకు ముప్పు పొంచి ఉన్నదని మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు రాములు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ను సింధనూర్, టీటీదొడ్డి గ్రామాల రైతులతో కలిసి ఆయన పరిశీలించారు.
18ఏండ్లుగా చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు పెండింగ్‌లో ఉండటం, ప్రస్తుతం రిజర్వాయర్‌కు భారీ వరద వచ్చి చేరుతుండడంతో దిగువన ఉన్న గట్టు మండలంలోని లింగాపురం, అయిజ మండలంలోని సింధనూర్, టీటీదొడ్డి గ్రామాల పరిధిలోని దాదాపు 5వేల ఎకరాల భూమి కోతకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. అలాగే ఆర్డీఎస్ ప్రధానకాల్వకు గండి పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రిజర్వాయర్ 55అడుగుల మేర ఎత్తు ఉండాల్సి ఉండగా, ఒక వైపున 150 మీటర్ల పొడవు 30అడుగుల మేరకే మట్టి పటిష్టం చేయడంతో 20రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద రిజర్వాయర్‌లోకి చేరి తక్కువ ఎత్తులో ఉన్న కట్ట వద్ద నీటి మట్టం క్రమేపీ పెరుగుతుందన్నారు. వరద పెరుగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. కట్ట పటిష్టం చేయడంతోపాటు నిబంధనల మేరకు కర కట్ట ఎత్తు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు కట్టఎత్తును పెంచి ప్రమాదం జరగకుండా నిలువరించడంతోపాటు నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.