ఖిల్లాఘణపురం/పెద్దమందడి, అక్టోబర్ 17 : రామాయణ మహాకావ్యాన్ని రచించిన జ్ఞాననిధి వాల్మీకి మహర్షి అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం ఖిల్లాఘణపురం మండలం షాపూర్లో వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేశారు.
అలాగే పెద్దమందడి మండలంలోని బలిజపల్లిలో వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. వాల్మీకి మహర్షి వేటగాడిగా జీవితాన్ని ప్రారంభించి ప్రేమ ఆప్యాయతలను సమాజానికి పంచి రామాయణ మహాకావ్యాన్ని అందించిన తపస్వి అని కొనియాడారు. వాల్మీకి జీవితం ఆదర్శనీయమని, ఆయ న చూపిన మార్గంలో ముందుకు పయనించి అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలని సూచించారు.
అయిజ, అక్టోబర్ 17 : వాల్మీకి బోయల ఆరాధ్యదైవం, ఆదికవి మహర్షి వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శనీయమని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నారు. గురువారం పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలోని మహర్షి వాల్మీకి ఆలయంలో వాల్మీకి విగ్రహానికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాముడి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు మహర్షి వాల్మీకి అన్నా రు. మనిషిలో ప్రవర్తన మారితే మహర్షి కాగలరనడానికి వాల్మీకి నిదర్శనమన్నారు. రామాయణ కావ్య రచనతో వాల్మీకి చరిత్రలో గొప్ప ఆదికవిగా ప్రసిద్ధి పొందాడన్నారు. అలాగే అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి వాల్మీకి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.