నాగర్కర్నూల్(తాడూరు), ఏప్రిల్ 27 : తాడూరు మండల కేంద్రంలోని పీఏసీసీఎస్ కేంద్రం వద్ద మొక్కజొన్న సంచుల కోసం రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొక్కజొన్న ధాన్యం నింపడానికి గన్నీ బ్యాగులు దొరకడం లేదని రాత్రిపూటనే వచ్చి పీఏసీసీఎస్ కార్యాలయం ఎదుట నిద్రిస్తున్నారు. కూపన్ల కోసం ఆధార్, బ్యాంక్ అకౌంట్, దరఖాస్తు జిరాక్స్ పేపర్లు క్యూలో పెట్టి సంచుల కోసం పడిగాపులు కాస్తున్నారు. నెలరోజుల నుంచి రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ఎత్తకపోవడంతో రైతులు మండుతున్న ఎండలకు సం చుల కాపలా కాయడమే సరిపోతుందని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు.
ఈనెల 20వ తేదీన రైతులకు మొక్కజొన్న సంచుల కోసం ఇచ్చిన కూపన్లకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో సంచులు అందలేదు. కొంతమంది రైతులు అమ్మిన ధాన్యానికి థంబ్ పెట్టడానికి, మూడు విధాలుగా రైతులకు కూపన్లు ఇస్తుండడంతో రోజుల తరబడి సింగిల్ విండో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని రైతులు అంటున్నారు. మం డుతున్న ఎండలకు ఉదయమే సింగిల్ విండో కార్యాలయాల వద్దకు వచ్చి క్యూలో నిలబడుతున్నామంటున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎత్తడానికి లారీల, హమాలీల కొరత ఉండడంతో ఎక్కడ ధాన్యం అక్కడే నిలిచిపోయింది. ఈ ఇబ్బందులు పడలేక గ్రామాల్లో దళారులకు రూ.1,700 నుంచి రూ.1,830వరకు అమ్ముకుంటున్నారు.
ప్రభుత్వం రైతులకు రూ.2,400మద్దుతు ధర కల్పించడం వరకే తప్పా రైతులకు కావాల్సిన సౌకర్యాలు లేకపోవడంతో మధ్య దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవడం తప్పడం లేదంటున్నారు. ము ఖ్యంగా మండలంలోని కాంగ్రెస్ నాయకులే రైతుల నుంచి రూ. 2100, రూ.2,150 కొనుగోలు చేసి వారి గోదాంల్లో ధాన్యాన్ని నిల్వ చేసుకుంటున్నారు. అకౌంట్లో జమ అయిన మద్దతు ధరలో మిగతా డబ్బు లు తిరిగి రైతులు కాంగ్రెస్ నాయకులకు అప్పజెప్పాల్సి ఉంటుంది. అలాం టి వారికే సంచులు సరఫరా చేస్తున్నారని తమకు సంచులు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి సమయంలో వచ్చి గోదాం దగ్గర రైతు లు నిద్రిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా కల్లాల వద్దకే వెళ్లి మొక్కజొన్న పంటను తీసుకోవడానికి బస్తాలు, లారీలను, హమాలీలను పంపించి మద్దుతు ధరకే కొనుగోలు చేసేవారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పీఏసీసీఎస్లో రెగ్యులర్ ఉద్యోగులు రిటైర్డ్ కావడంతో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న ఉద్యోగులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల రైతులకు ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు.