సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ) : ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు నార్త్ సిటీ జనాలకు శాపంగా మార్చేసింది కాంగ్రెస్ సర్కారు. బహుళ ప్రయోజనాలతో ప్రజల సహకారంతో సజావుగా చేపట్టాల్సిన ప్రాజెక్టును కాస్తా వివాదస్పదం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు బాధితులకు పరిహారం చెల్లించకుండానే కూల్చివేతలు మొదలుపెట్టింది. ఓవైపు బాధితులే పరిహారం తేల్చండి? ప్రాజెక్టు వెడల్పును 200 మీటర్లకు తగ్గించాలంటూ డిమాండ్ చేస్తుంటే స్పందించని సర్కారు… కూల్చివేతలు మాత్రం మొదలుపెట్టింది. పరిహారం అందక ముందే సర్వం కోల్పోతున్నామనే ఆవేదన ఓవైపు, ఉన్న ఫలంగా ఇండ్లు, దుకాణాలను ఖాళీ చేయిస్తున్నారనే దిగులు మరోవైపు.. జేబీఎస్ నుంచి శామీర్పేట్ మార్గంలో చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ బాధితుల పరిస్థితి ఇది.
సర్కారు పరిహారం విషయంలో ఏక రీతి విధానాన్ని అమలు చేయకుండానే, ఎంపిక చేసుకున్నట్లుగా పరిహారం కట్టబెట్టి, ఆస్తులను స్వాధీ నం చేసుకోవడంతోపాటు, కూల్చివేతలు మొ దలుపెట్టి మిగిలిన జనాలను భయాబ్రాంతులకు గురిచేస్తుంది. రాజీవ్ రహదారిపై ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో భా గంగా రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేస్తుంది. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకుగాను రాజీవ్ రహదారిపై ప్యారడైజ్ నుంచి శామీర్పేట్ అవుటర్ రింగు రోడ్డు వరకు దాదాపు 18.5కి.మీ మేర ఆరు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిం ది. ఈ ప్రాజెక్టును సుమారు రూ. 5వేల కోట్ల తో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ చిక్కుల నుంచి పెద్ద ఉపశమనం దొరకనుంది.
పరిహారం వివాదం..
ప్రాజెక్టు పరిధిలో వందలాది ఎకరాల రక్షణ శాఖ భూములతోపాటు పెద్ద ఎత్తున ప్రైవేటు ఆస్తులను కూడా సేకరించాలని స ర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. కానీ గడిచిన రెండేళ్లలో ఏనాడు పరిహారం విషయాన్ని తేల్చకుండానే భూములు ఇవ్వాలని జనాలపై సర్కారు ఒత్తిడి చేస్తుంది. ఈ క్రమంలో తొలు త కొంత మందికి చెక్కులను మంజూరు చే సి, ఆ ఆస్తులను కూలగొడుతూ భయపెడుతుంది. ఈ క్రమంలో లోతుకుంట, అల్వాల్, బొల్లారం ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలు, నివాస గృహాలు రోడ్ల విస్తరణలో పోతుండగా.. చాలా మంది ఆస్తి యజమానులకు ఇప్పటికీ పరిహారం తేల్చలేదు. నోటీసులు ఇచ్చి పనులు ప్రారంభించిన అధికారులు, పరిహారం ఖాతాల్లోకి రాక ముందే జేసీబీలతో కూల్చివేస్తుండగా.. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు కూడా చెక్కు లు తీసుకుని నిర్మాణాలు కూల్చివేస్తున్నారు.
బాధితుల భరోసా ఏదీ..?
సర్కారు కూల్చివేతలు మొదలుపెట్టడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రస్తుత మార్కెట్ ధరలకు అనుగుణంగా చట్టబద్ధమైన నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించి, ఆ తర్వాత ఆస్తులను స్వాధీనం చేసుకోవాలంటున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పునరావాస ప్యాకేజీని వెల్లడించకుండానే బాధితులను గందరగోళంలో పడేస్తోంది. బాధితులతో సమగ్ర చర్చలు జరిపి స్పష్టమైన ప్రకటన చేయాల్సిన ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని మండిపడుతున్నారు.
ఇప్పటివరకు దాదాపు 700కుపైగా మంది బాధితులు కోర్టులను ఆశ్రయించి.. న్యాయపోరాటం చేస్తున్నారు. ఓవైపు కోర్టులో విచారణ సాగుతుండగానే.. ప్రభుత్వ యంత్రాం గం కొందరి ఆస్తులను కూలగొట్టి, మిగిలిన జనాలను భయపెట్టే ప్రయత్నం చేస్తుందంటున్నారు. ఇప్పటికైనా సర్కారు పరిహారం విషయంలో జనాలను అయోమయానికి గురిచేయకుండా, బాధితులతో సమగ్ర చర్చలు జరిపి, స్పష్టమైన గడువు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మౌలిక వసతుల కల్పన, నగరాభివృద్ధి అవసరమే అయినా… తమ కుటుంబాలను రోడ్డున పడేసే చర్యలను ఎప్పటికీ ఆమోదించలేమని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, బాధితులకు న్యాయబద్ధమైన పరిహారం అందించిన తర్వాత కూల్చివేతలు మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.