మక్తల్, మే 9 : నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకానికి భూసేకరణ చేపట్టడం కోసం మక్తల్ తాసీల్దార్ సతీశ్‌కుమార్ అధ్యక్షతన మక్తల్ మండలంలో కాట్రేపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన భూసేకరణ గ్రామసభకు ఆర్డీవో రాంచందర్ ముఖ్యఅతిథిగా హాజరై రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు తమకు ప్రభుత్వం నుంచి నిర్దిష్టమైన హామీ వచ్చిన తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. గతంలో భూత్పూర్ రిజర్వాయర్ నిర్మాణంలో కాట్రేపల్లి గ్రామానికి చెందినటువంటి 300ఎకరాల భూమి రైతుల కోల్పోవాల్సిన పరిస్థితి తలెత్తిందన్నారు. మళ్లీ ఇప్పుడు మిగిలి ఉన్న కొంత భూమిని కూడా రిజర్వాయర్ నిర్మాణానికి ఇస్తే మాకు ఎలాంటి జీవనాధారం లేకుండా పోతుందని ఆర్డీవో దృష్టికి రైతన్నలు తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న ప్రతి రైతుకూ మక్తల్ మండలంలోనే పట్టా భూమిని అందించాలని, ఒకవేళ భూమి ఇవ్వకపోతే, ప్రాజెక్టులో భూమి కోల్పోతున్న రైతులందరికీ ఎకరాకు రూ.70లక్షల నుంచి రూ.80లక్షల వరకు నష్టపరిహారం అందించిన తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టాలని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అధికారులు రైతులకు ఏం సమాధానం చెప్పాలో తోచక నివ్వెర పోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
అనంతరం ఆర్డీవో రాంచందర్ మాట్లాడుతూ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం కాట్రేవుపల్లి శివారులో పంప్ హౌస్, సబ్స్ట్టేషన్ నిర్మాణం కోసం భూమి సేకరణ చేసేందుకు గ్రామసభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పంప్ హౌస్, సబ్స్ట్టేషన్ కోసం 24ఎకరాల 11 సెంట్లు, 67ఎకరాల 36 సెంట్ల భూమిని భూసేకరణ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేస్తారని, రైతులకు తమ అభిప్రాయాలు వెల్లడించాలనే లక్ష్యంతో గ్రా మంలో గ్రామ సభను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ క్రమంలో రైతులు ప్రభుత్వం 2013 భూ సేకరణ చట్టం ప్రకారంగా పరిహారం ఇస్తామంటే, ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని అధికారులకు తెలిపారు.
గ్రామసభ తీర్మానంలో భూముల కోల్పోతున్న రైతులు ఎవరూ సంతకాలు చేయకపోవడంతో అధికారులు మాత్రమే సంతకాలు పెట్టి గ్రామసభ ముగించి తదుపరి గ్రామానికి వెళ్లారు. అలాగే ఎర్న్ర గాన్పల్లిలో ఉదయం 11 నుంచి 12గంటల వరకు నిర్వహించాల్సిన గ్రామ సభను అధికారులు 10:45 గంటలకే ప్రారంభించడంతో ఒకే ఒక రైతు హాజరు కాగా తన అభిప్రాయాన్ని తీసుకొని 20నిమిషాలలో గ్రామసభను ముగించి అధికారులు మామ అనిపించారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు నిర్దిష్టమైన హామీలను ఇవ్వకుండానే, పేరుకే గ్రామ సభలు నిర్వహించి అధికారులు తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని భూముల కోల్పోతున్న రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.