గోపాల్పేట, ఆగస్టు 11 : కాల్వల ద్వారా కేఎల్ఐ నీటిని వదలి చెరువులు, కుంటలు నింపి సకాలంలో రైతులకు సాగు నీరు అందించాల్సిన సమయంలో చాకల్‌పల్లి శివారులో కేఎల్ఐ డీ- 8 కాల్వకు అడ్డంగా సూపర్ ప్యాసేజ్ (ఎస్.పీ) పనులు చేపట్టడం ఏమిటని రైతులు, బీఆర్ఎస్ నాయకులు మండిపుడుతన్నారు. ఈ మేరకు మంగళవారం రైతులు, బీఆర్ఎస్ నాయకులు సూపర్ ప్యాసేజ్ నిర్మాణ పనులను పరిశీలించి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు అడ్డాకుల తిరుపతియాదవ్ రైతులతో కలిసి మాట్లాడుతూ నీళ్లు వదలాల్సిన సమయంలో కాల్వకు అడ్డంగా మట్టి పోసి దానిపై స్లాబ్ వేస్తే నీళ్లు ఎలా ముందుకు పోతాయని ప్రశ్నించారు.
ఎండాకాలంలో చేయాల్సిన పనులు కాల్వలకు నీళ్లు వదిలే సమయంలో వానకాలంలో చేయడం ఏమిటని మండిపడ్డారు. ఎస్.పీ నిర్మాణ పనులు చేపట్టిన సంబంధిత కాంట్రాక్టర్ సెంట్రింగ్పై స్లాబ్ వేయకుండా, కాల్వకు అడ్డంగా మట్టిపోసి మైతార్ చేసి స్లాబ్ వేయడంతో కాల్వకు అడ్డుగా ఉన్న మట్టి తొలగిస్తే గాని నీళ్లు ముందుకు సాగవని, మట్టి తొలగించినా, కాల్వ నిండా నీళ్లు పోతే, నీటి ప్రవాహం ఒత్తిడికి నిర్మాణంలో ఉన్న సూపర్ ప్యాసేజ్ క్యూరింగ్ సరిగ్గా లేక తెగిపోయే అవకాశం ఉందన్నారు. ఎగువ రాష్ర్టాల నుంచి వచ్చిన వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండి, ఆ నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకు పోతుంటే, ఇక్కడున్న కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్రలో ఉంటే, బీఆర్ఎస్ పార్టీ నీటి కోసం రైతులతో కలిసి ఉద్యమిస్తామనడంతో ప్రభుత్వానికి చలనం వచ్చి ప్రభుత్వ యంత్రాంగం ఉరుకులు, పరుగులతో మోటర్లు ఆన్ చేశారన్నారు.
ఇదిలా ఉంటే.. గుడిపల్లి రిజర్వాయర్‌కు సంబంధించి షెట్టర్లకు ముందస్తు మరమ్మతులు లేక పోవడంతో వాటి రూఫ్‌లు తెగిపోయి కాల్వలకు నీళ్లు వదలడం మరింత జాప్యం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా సకాలంలో చెరువులు, కుంటలు నింపి రెండు పంటలకు సాగు నీరు అం దించాలని డిమాండ్ చేశారు. అయితే సూపర్ ప్యాసేజ్ విషయమై సంబంధిత కాంట్రాక్టర్, అధికారులను అడుగగా ఒకటి, రెండు రోజుల్లో ఎస్పీ నిర్మాణం కోసం కాల్వకు అడ్డుగా వేసిన మట్టిని జేసీబీతో తొలగించి సాగు నీరు సజావుగా ముందుకు సాగేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమం లో సర్పంచ్ లొంక శేషిరెడ్డి, ఉప సర్పంచ్ కేశవులు, మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, పార్టీ నాయకులు రాజేశ్ గౌడ్, మన్యంనాయక్, జహంగీర్, మనేశ్బాబు, రాజారాంరెడ్డి, యేసేపు, ఆంజనేయులు, శేఖరెడ్డి, నాగిరెడ్డి, ధర్మారెడ్డి, జమ్ములు, మహమూద్, గిరి, కేశవులు, కాశీనాథ్, రాజు, మూర్తి, వెంకటయ్య, శేఖర్, రమేశ్‌తోపాటు రైతులు పాల్గొన్నారు.