వంగూరు, జూన్ 10 : సమస్యలు సభ దృష్టికి తీసుకొచ్చిన పాపానికి అధికార పార్టీ సర్పంచ్ భర్త బీఆర్ఎస్ నేతపై కుర్చీ విసిరి దౌర్జన్యం చేసిన ఘటన మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో చోటు చేసుకున్నది. మండలంలోని సర్వారెడ్డిపల్లి, సర్వారెడ్డిపల్లి తండా, వంగూరు, వెంకటాపూర్, ఉప్పల్‌పహాడ్, చౌదర్పల్లి గ్రామాల్లో చివరిరోజు గ్రామసభలు నిర్వహించారు.
చౌదర్పల్లిలో సర్పంచ్ చూడామణి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించగా గ్రామంలో మందు, సారా, గుట్కా విక్రయాలను నిలిపివేయాలని గ్రామస్తులు తీర్మానం చేసిన వినతిపత్రాన్ని గ్రామ బీఆర్ఎస్ నేత ప్రవీణ్‌రెడ్డి సభలో సర్పంచుకు అందజేశారు. అనంతరం గ్రామ సమస్యలను ప్రవీణ్‌రెడ్డి సభ దృష్టికి తీసుకెళ్లగా అధికారుల ముందే సర్పంచ్ చూడామణి భర్త నరేందర్‌రెడ్డి ఆగ్రహంతో బూతులు తిడుతూ కుర్చీ లేపి ప్రవీణ్‌రెడ్డి పైకి విసిరేశాడు. దీంతో సభలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. కార్యక్రమంలో వివిధ మండల శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.