నాగర్ కర్నూల్ రూరల్ : అగ్నిప్రమాద నివారణ వారోత్సవాలు (Fire Prevention ) సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లాలో అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 14 న ప్రారంభమైన వారోత్సవాలు ఈనెల 20న ముగిస్తున్నాయి.
ఈ సందర్భంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది ( Fire Staff ) ప్రతిరోజు ఒక అంశంపై వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలలో పనిచేసే సిబ్బందికి, బస్టాండులో ప్రయాణికులకు, సినిమా హాల్స్ ( Cinema Halls ) , షాపింగ్ మాల్స్ యాజమాన్యం, సిబ్బందికి అగ్ని ప్రమాదాల నివారణపై జాగ్రత్తలు, సూచనలు చేస్తూ అవగాహన కలిగిస్తున్నారు.
శనివారంనాడు అగ్నిమాపక శాఖ స్థానిక అధికారి ఇంజమూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల, కళాశాలల విద్యార్థులకు ‘ అగ్ని ప్రమాదాలు -వాటి నివారణ మార్గాలు ’ అనే అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించి, అవగాహన కల్పించారు. వ్యాసరచన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నామని అధికారి వెల్లడిచారు. ఉయ్యాలవాడ గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఎండి వహీదుద్దీన్, పి రంగస్వామి , ఎండి ఖదీర్ , ఎం శంకర్, పి మల్లేష్, పి వెంకటేశ్వరరావు, హోంగార్డ్స్ ఎండీ కైఫ్, ఎం అమరేందర్ తదితరులు పాల్గొన్నారు.